వైసీపీ మంత్రులు, నేతలు బయట ఎలాగూ అధికార దర్పం ప్రదర్శిస్తూనే ఉంటారు కానీ భగవంతుని దర్శనానికి వచ్చినప్పుడు కూడా తమ పదవి, అధికార దర్పం చూపించుకోకుండా ఉండలేకపోతున్నారు. గత నెలలో మంత్రి సీదిరి అప్పలరాజు సుమారు 130 మంది అనుచరులను వెంటబెట్టుకొని తిరుమలకు వచ్చి అందరికీ స్పెషల్ దర్శనం చేయించి విమర్శలపాలయ్యారు.
ఈరోజు మంత్రి ఉషశ్రీ చరణ్ 50 మంది అనుచరులను వెంటబెట్టుకొని తిరుమలకువచ్చి అందరికీ బ్రేక్ దర్శనం చేయించారు. మరో 10 మంది అనుచరులకు సుప్రభాత దర్శనం టికెట్లు కూడా ఇప్పించారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. క్యూ కాంప్లెక్స్ అంతా నిండిపోయి సుమారు రెండు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్లలో నిలుచొన్నారు. వారిలో వృద్ధులు, పసిపిల్లలు కూడా ఉన్నారు.
తిరుమలలో ఈ వారం రోజులు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించిన టీటీడీ ఈ నెల21 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన 50 మంది అనుచరులను వెంటబెట్టుకొని దర్జాగా బ్రేక్ దర్శనం చేసుకొని వెళ్లారు.
అసలే 12-24 గంటల పాటు క్యూలైన్లలో నిలబడి నిలబడి సహనం కోల్పోయిన శ్రీవారి భక్తులు మంత్రి ఉషశ్రీ చరణ్‌పై మండిపడ్డారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, “నేను దర్శనం చేసుకొనే సమయానికి మా ఊరు నుంచి కొంతమంది వస్తే, చాలా దూరం నుంచి వచ్చారనే ఉద్దేశ్యంతో వారినీ నాతోపాటు లోనికి తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం చేయించాను. వేరే ఉద్దేశ్యం లేదు,” అని చెప్పి వెళ్ళిపోయారు. దేవుడి ముందు కూడా మంత్రిననే అహం విడిచిపెట్టలేనప్పుడు ఎన్ని దేవుళ్ళను దర్శించుకొంటే మాత్రం ఏం ప్రయోజనం?



