ఏపీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కున్న చాలామంది వైసీపీ నేతలు, మద్దతుదారులు ఇప్పటికే కటకటాల వెనక్కి వెళ్లి బెయిలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.
లిక్కర్ స్కాములో మిథున్ పాత్రను నిర్దారించడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అతని కస్టోడియల్ దర్యాప్తు అవసరమని ప్రాసిక్యూషన్ అంగీకరించింది. దీనితో మిథున్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లుగా భావించవచ్చు.
అయితే హైకోర్టు లో తనకు ఎదురు గాలి వీయడంతో మిథున్ రెడ్డి అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ అరాచకంలో తండ్రి పెద్ది రెడ్డి పాత్ర ఎంత కీలకమో తనయుడు మిథున్ రెడ్డి పాత్ర కూడా అంతే కీలకంగా మారింది.
కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదు అంటూ టీడీపీ క్యాడర్ ను అణిచివేస్తూ వైసీపీ క్యాడర్ ను రెచ్చకొట్టడంలో పెద్దిరెడ్డి చాల పెద్ద పాత్రే పోషించారు. ఇక జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన మిథున్ రెడ్డి ముద్రగడతో కలిసి పవన్ ఓటమి కోసం కంకణం కట్టుకున్నారు.
ఇలా ఈ ఇద్దరు నాయకులు వైసీపీ పార్టీకి కీలకంగా, జగన్ సన్నిహితులుగా గత ఐదేళ్లు రెచ్చిపోయారు. ఇప్పుడు లిక్కర్ స్కాం లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. వైసీపీలో నెంబర్ 2 గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి కూడా పెద్దిరెడ్డి దందా రాజకీయాల మీద ‘కోటరీ కట్టుబాట్లు’ అంటూ పరోక్ష విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ అధినేత దర్శన భాగ్యం దొరకాలన్నా, ముఖ్యమంత్రిగా జగన్ కటాక్షం లభించాలన్న, తాడేపల్లి పాలస్ గేట్లు తెరుచుకోవాలన్నా పార్టీ నాయకుల నుంచి ప్రభుత్వ మంత్రుల వరకు ప్రతి ఒక్కరు జగన్ కోటరీ కట్టుబాట్లను పాటించాల్సిందే.
అలాగే ప్రత్యర్థి పార్టీల నేతలను విమర్శించడం దగ్గర నుంచి సొంత పార్టీ ప్రచారం వరకు అన్ని అంశాలలోను వైసీపీ క్యాడర్ నుంచి లీడర్ వరకు అందరు ఈ కోటరీ స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇసుక దోపిడీ నుంచి మైనింగ్ మాఫియా వరకు, లిక్కర్ స్కాం నుంచి కాంట్రాక్టర్ల దందా వరకు మొత్తం ఈ కోటరీ కనుసన్నలనే అన్న అభిప్రాయం వైసీపీలోనే అంతర్గతం వినిపించే ప్రచారం.
ఈ కోటరీ లో సభ్యలైన వారు వైసీపీ కి వ్యతిరేకంగా కానీ జగన్ ను ఇరికించేలా కానీ రాజకీయం చేయడంలో ఆసక్తి చూపించారు. వీరంతా వైసీపీ అరాచకానికి వారసులుగా, జగన్ అక్రమాలకు వాటాదారులుగా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు జరిగితే అది వైసీపీ కి ఊహించని షాక్ అవుతుంది.
అలాగే పెద్ది రెడ్డి రాజకీయానికి ఎదురు దెబ్బ గా మారుతుంది. ఇప్పటికే ఈ కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో మిథున్ రెడ్డి అరెస్టు కోటరీ కట్టుబాట్లకు తలొగ్గి మౌనంగా ఉండిపోతారా.? లేక ఈ స్కాం వెనుక దాగున్న అసలు బిగ్ బాస్ ను తెరమీదకు తీసుకొస్తారు.?




