సహజంగా తమ అభిమాన హీరోలపై ఉన్న ప్రేమను చూపించుకునే క్రమంలో ఫ్యాన్స్ చేసే పనులు ఇతరులకు కాస్త ఓవర్ గా ఉంటాయి. ఇందులో ఏ ఒక్క హీరో అభిమానులను వేరు చేయలేం. అయితే ఈ ఒరవడి ఇటీవల రాజకీయాలకు కూడా పాకినట్లు కనపడుతోంది. అది ఎంతగా అంటే… ఏకంగా దేవుడిగా కొలిచే శ్రీరాముడి పాలనను ఏకంగా ప్రస్తుత రాజకీయ నేతలతో పోల్చేటంతగా! అయితే ఈ పోలికలే కొన్ని సార్లు విమర్శలకు దారి తీస్తాయన్న విషయాన్ని వైసీపీ నేత రోజమ్మ మరిచినట్లున్నారు.
‘శ్రీరామనవమి’ సందర్భంగా ఒంటిమెట్ట ఆలయాన్ని సందర్శించిన రోజా మాట్లాడుతూ… సుపరిపాలన సాగించిన శ్రీరాముడి తరువాత, అటువంటి పాలన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ప్రజలు చూశారని, ఆ తరువాత జగన్ రాకతోనే రామరాజ్యం వస్తుందని… తమ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అభిమానాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా ఈ విధంగా ప్రదర్శించారు. త్వరలోనే ఏపీలో రాముడి పాలన తిరిగి మొదలవుతుందని అన్న రోజా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంటే రోజా ఉద్దేశం… జగన్ మాదిరే శ్రీరాముడు కూడా కేసుల్లో ఇరుక్కున్నారా? అలాగే వైఎస్ పాలనలో జరిగిన అవినీతి నాడు శ్రీరాముడు పాలనలో కూడా జరిగిందని రోజా చెప్తున్నారా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అభిమానం ప్రదర్శించే ముందు, అత్యుత్సాహాన్ని పక్కనపెట్టి, వాస్తవాలతో మాట్లాడితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి రోజా ఏం చెప్పదలుచుకున్నారో గానీ, శ్రీరాముడితో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, జగన్ ను పోల్చడం భక్తులు కూడా జీర్ణించుకోలేని అంశంగా మారింది.



