ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో నుంచి వారికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విత్ డ్రా చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై ఉద్యోగుల సంఘం మాజీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందిస్తూ, “ఇటువంటి వింతలు, విడ్డూరాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరుగుతాయి. ఉద్యోగులు జీపీఎఫ్ ఖాతాలో పొదుపు చేసి దాచుకొన్న సొమ్మును వారికి తెలియకుండా ప్రభుత్వం తీసి వాడుకోవడం ఏమిటి? నేటికీ ఉద్యోగులకు ఈయవలసిన బకాయిలు చెల్లించకపోగా వారి జీపీఎఫ్ ఖాతాలో డబ్బు కూడా తీసుకోవడం చాలా దారుణం. తమ ఖాతాలలో ఏకంగా రూ.800 కోట్లు మాయం అయ్యాయని తెలిసిన తరువాత ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తున్నాయో తెలీదు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి వెంటనే వసూలు చేసుకోకపోతే ఆ సొమ్ము ఇక ఎప్పటికీ తిరిగిరాదు. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.
ఏపీ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ “మా జీపీఎఫ్ ఖాతాలకు ప్రభుత్వం కస్టోడియన్‌గా ఉంటుంది. కానీ మాకు తెలియకుండా మా ఖాతాలలో డబ్బును వెనక్కు తీసుకోవడం అంటే దొంగతనం చేయడమే అవుతుంది. గతంలో కూడా ఓసారి ఈవిధంగానే జరిగితే మేము మంత్రులు, ఆర్థికశాఖ అధికారుల సమావేశంలో ఫిర్యాదు చేసాము. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగానే మా డబ్బు మా ఖాతాలలో జమా చేశారు. కనుక ఆ వివాదం అక్కడితో ముగిసిపోయిందనే ఉద్దేశ్యంతో ఫిర్యాదు చేయలేదు. కానీ మళ్ళీ నిన్న రాత్రి మా జీపీఎఫ్ ఖాతాలలో నుంచి ప్రభుత్వం డబ్బు వెనక్కు తీసుకొంది. కనుక ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నదే అని స్పష్టమైంది. మాకు తెలియకుండా మా జీపీఎఫ్ ఖాతాలలో నుంచి డబ్బులు వెనక్కు తీసుకోవడం చాలా నీచమైన పని. మా ఖాతాలలో మా సొమ్మును మాకు తెలియకుండా తీసుకోవడం చాలా తీవ్రమైన నేరం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయబోతున్నాము,” అని హెచ్చరించారు.



