పిఠాపురం…ఎవరి దారి వారిదేనా.?

Naga Babu

కూటమి పార్టీల పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఆధిపత్యం కోసం అంతర్ యుద్ధం జరుగుతుంది. పవన్ కోసం సీటు త్యాగం చేసాం, పవన్ గెలుపు కోసం శ్రమ దార పోశం అంటు టీడీపీ శ్రేణులు, త్యాగానికి తగ్గ గౌరవం ఇచ్చాం, ఇక పిఠాపురం జనసేన అడ్డా అంటూ జనసైనికులు ఎవరో ధోరణిలో వారు ముందుకెళ్తున్నారు.

కార్యకర్తల తీరుకు తగ్గట్టే ఇరు పార్టీల ముఖ్య నేతలు కూడా ఒకరి పై మరొకరు పరోక్ష విమర్శలు చేసుకుంటూ అటు ప్రత్యర్థి వైసీపీ పార్టీకి, ఇటు రెండు పార్టీల క్యాడర్ కు కూటమి బంధం పై విమర్శలు చేసే అవకాశాన్ని చేచేతుల అందిస్తున్నారు. తాజాగా జనసేన ఖాతాలో ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకార చేసిన నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు.

ADVERTISEMENT

అయితే ఈ కార్యక్రమాలో పాల్గొన్న టీడీపీ, జనసేన శ్రేణులు వారి వారి పార్టీ నినాదాలతో పోటాపోటీ గా బలప్రదర్శనకు దిగారు. జై టీడీపీ, జై వర్మ అంటూ టీడీపీ క్యాడర్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇదంతా కూడా అనవసర రాద్ధాంతమనే చెప్పాలి. ఇందులో తప్పెవరిది.? ఒప్పెవరిది.? అంటే అది వారి విజ్ఞతకే వదిలిపెట్టాలి.

ఇటు పార్టీల అధినేతలేమో అన్న తమ్ముళ్ల మాదిరి, గురు శిష్యుల లెక్క ఒక్కటిగా రాష్ట్ర అభివృద్ధి కోసం నడుబిగిస్తే ఇటు చోటామోటా నాయకులు ఇలా తమ వ్యక్తిగత కారణాలతో కూటమి బంధాన్ని విచ్ఛిన్నం చేయడం ఇరు పార్టీల నాయకులకు సమంజసం కాదు. ఇక్కడ త్యాగం చేసింది ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, టీడీపీ పోటీ చెయ్యాలనుకున్న మరో 28 స్థానాలలో కూడా టీడీపీ నాయకులు తమ మిత్ర పక్ష పార్టీల నాయకులకు అవకాశం ఇచ్చారు.

అలాగే వారి గెలుపు కోసం తమ వంతు కష్టం చేసారు. అయితే అందులో కొందరికి ఎమ్మెల్సీ పదవులతో పార్టీలో న్యాయం జరిగింది, ఇంకొందరికి జరగాల్సి ఉంది. ఇందులో వంగవీటి రాధ కూడా ఒకరిగా గుర్తించాలి. వైసీపీ నాయకులు తనను ఎంతలా ప్రలోభ పెట్టినా, కూటమి పొత్తు కోసం తన సీటు పట్ల టీడీపీ అధిష్టానం తో పంతానికి దిగలేదు రాధా, అలాగే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఎక్కడ పదవుల గురించి కానీ, తన రాజకీయ భవిష్యత్ గురించి కానీ ప్రస్తావించలేదు.

తనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు రాధా. అలాగే ఇటు జనసేన నుంచి కూడా సీటును ఆశించి వెనక్కి తగ్గిన నాయకులు ఉన్నారు. వారందరి నియోజకవర్గాలలో లేని ఈ ఆధిపత్య కుమ్ములాట ఒక్క పిఠాపురంలోనే ఎందుకు కనిపిస్తుంది. ఇందులో పొత్తు ధర్మం గీత దాటుతున్న ఆ నేతలవారు.?

వారిని గుర్తించి వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఆయా పార్టీల అధినేతలు వారి చర్యలను కట్టడి చెయ్యాలి. మొక్కగా ఉన్నప్పుడే సమస్యను కూకటి వేళ్ళతో పెకిలించాలి లేకుంటే రేపటి రోజున అదే ఒక మహా వృక్షం లా మారి పిఠాపురంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ప్రమాదం లేకపోలేదు.

ADVERTISEMENT
Latest Stories