ఒక్కప్పుడు టిడిపి నుంచి చంద్రబాబు నాయుడుచేత బహిష్కరించబడిన తెలంగాణలోని సీనియర్ దళిత నేత మోత్కూపల్లి నరసింహులు, ఈరోజు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మాట్లాడుతూ, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మీద్ నిప్పులు చెరగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
“వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసే ఆంధ్రా ప్రజలు జగన్‌ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే అధికార మదంతో విర్రవీగుతున్నారు. జగన్‌కు అధికార మైకం ఎంతగా ఆవహించిందంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వేలకిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లి షర్మిలని మెడ పట్టుకొని రాష్ట్రం నుంచి బయటకు గెంటేశారు. చివరికి తల్లి విజయమ్మను కూడా గెంటేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.
చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశారు. అటువంటిది ఆయన ముష్టి 300 కోట్ల కోసం ఆశపడతారనుకోవడం అవివేకమే. ప్రధాన మంత్రులతో, విదేశీ కంపెనీల అధినేతలతో కలిసి పనిచేసిన ఆ పెద్దమనిషిని, జగన్ అరెస్ట్ చేయించి జైల్లో వేయడం ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే. ఇది జగన్ దురహంకారానికి పరాకాష్ట.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కానీ జగన్ పైశాచికత్వం పరాకాష్టకు చేరింది. ఆయన కూడా తన తండ్రిలాగా తమకు ఏదైనా మేలు చేస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే, వారి ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంధ్రాకు రాజధాని కూడా లేకుండా చేశారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాజధానిలేని రాజ్యాన్ని జగన్ ఓ నిరంకుశ చక్రవర్తిలా పాలిస్తున్నారు.
ఏపీలో ఎక్కడ చూసినా రౌడీ రాజ్యమే కనిపిస్తోంది. ప్రజల సమస్యలు, బాధలు ఏవీ పట్టించుకోకుండా రాజకీయకక్షల కోసమే అధికారంలోకి వచ్చిన్నట్లు జగన్ ప్రవర్తిస్తున్నారు. ఈ నాలుగేళ్ళలో ఏపీలో ఒక్క అభివృద్ధిపని జరుగలేదు. జగన్, ఆయన మంత్రులు కలిసి రాష్ట్రాన్ని అధోగతి పట్టించేశారు. అయినా మళ్ళీ తమనే ఎన్నుకోవాలని నిసిగ్గుగా అడుగుతున్నారు.
ఇకనైనా జగన్ మామూలు మనిషిలా మారి చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడుపై ఏవిదంగా కక్ష తీర్చుకోవాలని కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ఏవిదంగా అభివృద్ధి చేయాలని కనీసం ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిది. లేకుంటే వచ్చే ఎన్నికలలో ఏపీ ప్రజలే తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని మోత్కుపల్లి నర్సింహులు హితవు పలికారు.



