శాసనసభ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకొని చాలా అనుచితంగా కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్, ప్రజా కూటమి గెలిచిన తర్వాత తన ఓటమి(?)ని హుందాగా ఒప్పుకున్నారు. తన ధోరణి తప్పని కూడా ఒప్పుకున్నారు.
అందుకు మూల్యం చెల్లిస్తూ తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు కూడా. కనుక ఆయన మళ్ళీ వచ్చి ఏదైనా సవాళ్ళు విసిరితే తప్ప ఆయన అధ్యాయం అక్కడితో సమాప్తం అయిపోయిన్నట్లే భావించాలి.
కానీ తమ అభిమాన హీరోని, తమ నేతని ఆయన అనరాని మాటలు అన్నందుకు అభిమానులు లేదా జనసైనికులు నేటికీ ఆయనను ఇబ్బంది పెడుతుండటం నిజమైతే అది ఎంత మాత్రం సబబు కాదు.
ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చి ఈవిదంగా రోజూ తనను వేధించడం కంటే ఒకేసారి తనను, తన కుటుంబ సభ్యులను చంపించేయమని పవన్ కళ్యాణ్‌కు మొర పెట్టుకున్నారంటే ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారో గ్రహించవచ్చు.
ఆయన తనను వ్యతిరేకించి వైసీపిలో చేరినా, తన పట్ల అనుచితంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. కనీసం పట్టించుకోలేదు.
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చూపిన ఈ హుందాతనమే అందరినీ మెప్పించింది. కూటమిని గెలిపించింది. ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేసిందని జనసైనికులు గుర్తుంచుకోవాలి. వారు తమ అధినేతని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలలో రాణించాలి తప్ప మరొకరి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. ఈవిదంగా చేస్తుంటే తమ వలననే తమ అధినేత పవన్ కళ్యాణ్‌కు చెడ్డ పేరు వస్తుందని మరిచిపోకూడదు. పవన్ కళ్యాణ్ పైకి శాంతమూర్తిలా నటిస్తూ ఆయనే జనసైనికులను ముద్రగడ పద్మనాభ రెడ్డిపైకి ఉసిగొల్పుతున్నారనే ఆరోపణ వస్తే అది మంచిదేనా?
కనుక యుద్ధం సమాప్తం అయ్యింది కనుక పవన్ అభిమానులు కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డితో యుద్ధ విరమణ చేయడం అవసరమే.
ఒకవేళ వారు యుద్ధం కొనసాగించాలనుకుంటే ఇంకా అహంభావంతో విర్రవీగుతున్న వైసీపి నేతలను, వారి అధినేతని రాజకీయంగా ఎదుర్కోగలిగితే ఎవరూ తప్పు పట్టరు.
కానీ ఓటమిని అంగీకరించి, దణ్ణం పెట్టి వేడుకుంటున్న పెద్దాయన ముద్రగడ పద్మనాభరెడ్డిని ఇబ్బంది పెట్టడం సరికాదు.
పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వచ్చే ఉంటుంది కనుక ఆయన కూడా తన వీరాభిమానులకు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం.




