విశాఖ రాజధాని అంటే ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి అని వైసీపి నేతలు నిర్వహించేవారు. అయితే వారు చెప్పే ఆ అభివృద్ధి జిల్లాలలో ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడమే అనే విషయం ఆ సమయంలోనే టిడిపి, జనసేనలు బయటపెట్టాయి.
కానీ అధికారంలో ఉన్నామనే ధీమాతో ప్రతిపక్షాల ఆరోపణలను ఏమాత్రం లెక్కజేసేవారు కారు. కానీ అధికారం కోల్పోయాక వారి పాపాలు ఒకటొకటిగా బయటపడి వారి మెడకు చుట్టుకుంటున్నాయి.
వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె భీమిలి సముద్ర తీరాన్ని కబ్జా చేసి నిర్మించుకున్న ప్రహారీ గోడని ఇటీవలే రెవెన్యూ అధికారులు కూల్చేశారు. దసపల్లా భూముల వ్యవహారంలో విజయసాయి రెడ్డి పేరు కూడా ఆ మద్యన మారుమ్రోగిపోయింది.
తాజాగా ‘హయగ్రీవ’ భూభాగోతంలో ఈడీ కేసు నమోదు చేసి విశాఖ మాజీ వైసీపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన మేనేజింగ్ పార్ట్ నర్ గద్దె బ్రహ్మాజీ, వారి ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు చేశారు.
విశాఖలో ‘ఎండాడ’ ఋషికొండ బీచ్‌కి అతి సమీపంలో ఉండటంతో శరవేగంగా అభివృద్ధి చెందిదింది. అభివృద్ధి చెందక మునుపు ఆ ప్రాంతం అంతా బండరాళ్ళతో నిండిన కొండలు ఉండేవి. ఆ సమయంలోనే అంటే 2010లో ఆ ప్రాంతంలో వృద్ధులు, అనాధలకు ఆశ్రయం కల్పించేందుకు హయగ్రీవ ఫామ్స్ డెవలపర్స్ సంస్థకు ప్రభుత్వం రూ.5.63 కోట్లకు కేటాయించింది.
కానీ ఆ తర్వాత ఎండాడ అనూహ్య వేగంతో అభివృద్ధి చెందడంతో అదే భూమి ధర ఇప్పుడు రూ.200 కోట్లకుపైనే ఉంది. అధికారంలోకి వచ్చిన వైసీపి ఎంపీ, విశాఖ జిల్లాలోనే పేరుమోసిన బిల్డర్‌గా గుర్తింపు పొందిన వైసీపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కళ్ళు సహజంగానే దానిపై పడ్డాయి.
వడ్డించేవాడు మనవాడైతే… అన్నట్లు వైసీపియే అధికారంలో ఉంది కనుక చకచకా పావులు కదిపారు. తప్పుడు పత్రాలు, బినామీ లావాదేవీలతో హయగ్రీవ ప్రాజెక్టుని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత వృద్ధులు, అనాధల కోసం కేటాయించిన ఆ భూమిని ప్లాట్లు వేసి 2021లో తప్పుడు పత్రాలతో అమ్మేశారు. ఆవిదంగా రూ.150 కోట్లు పైనే ఆర్జించారని ఈడీ ధృవీకరించింది.
‘హయగ్రీవ, దసపల్లా’ భూ వ్యవహారాలలో గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే, విశాఖ రాజధాని పేరుతో వైసీపి నేతలు ఏవిదంగా భూములు కాజేశారనేది.
మరో సత్యం ఏమిటంటే, అన్ని కేసులలాగే ఈకేసు విచారణ ఇంకా మరికొంత కాలం కొనసాగుతుంది… ఆ తర్వాత హటాత్తుగా దాని విచారణ నిలిచిపోవడమో లేదా మరొకటో జరుగుతుంది. ఎవరెవరు ఎంత మేసేశారనేది ఎవరికీ తెలీదు. తెలిసినా వాటిని ప్రభుత్వం కక్కించలేదు.
కనుక ప్రజలు దీనిని కూడా ఓ వార్తగా చదివి మరిచిపోవడం ఖాయం. ఆ తర్వాత ఇలాంటివే మరిన్ని వార్తలు… వాటిని మరిపించేందుకు మరేదో కల్తీ నెయ్యి, అత్యాచారం, హత్య ఇలా ఏదో ఓ హాట్ టాపిక్… లైనుగా ఒకదాని తర్వాత మరొకటి పుట్టుకొచ్చేస్తుంటాయి.
కానీ భూభాకాసురులు మాత్రం ఎన్నటికీ పట్టుబడరు. శిక్షించబడరు. ఈ సందర్భంగా తాజాగా విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమా ట్రైలర్‌లో హీరో చెప్పిన డైలాగ్ “ఒంటిపై డబ్బు కనిపిస్తేనే సమాజంలో పుష్కలంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి,” గుర్తు వస్తుంది. నిజమే కదా? ఈ నేతల భూభాగోతాలు అందరికీ తెలిసి ఉన్నప్పటికీ వాటితో వారు సంపాదించి డబ్బుని చూసే సమాజం వారిని గౌరవిస్తుంటుంది.
కనుక ఇలాంటి అవినీతి భాగోతాలు తెలుసుకున్నందుకు సంతోషించాలా, వారిని ఏమీ చేయలేక గౌరవిస్తున్నందుకు సంతోషించాలా?




