Nagababu Comments in Janasena Formation Day meet

పిఠాపురంలో జరుగుతున్న జనసేన పార్టీ 12 వ ఆవిర్భావదినోత్సవ సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకు కౌంటర్ గా భావిస్తున్నారు టీడీపీ శ్రేణులు.

సభను ఉద్దేశిస్తూ మాట్లాడిన నాగబాబు పిఠాపురంలో పవన్ విజయం గురించి రెండు ముక్కలు అంటూ మొదలు పెట్టి, ఎన్నికలకు ముందే పిఠాపురంలో పవన్ విజయం దాదాపు ఖరారయ్యిందని, ఇందులో మా ప్రయత్నం కానీ, ఎవరి కష్టం కానీ ఏమి లేదని తేల్చేసారు. అలాగే అలాఉందని ఎవరైనా భావిస్తే అది వారి ‘ఖర్మ’ తప్ప మరొకటి లేదన్నారు.

Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు

అయితే గత కొద్దికాలం క్రితం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం గురించి టీడీపీ నేత వర్మ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు కు కౌంటర్ గానే నేడు నాగబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేసారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలాగే గత కొంతకాలం నుండి పిఠాపురంలో వర్మకు వ్యతిరేకంగా జనసేన రాజకీయ పావులు కదుపుతుంది అనే ఆరోపణలకు నేడు నాగబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అనేలా కనిపిస్తున్నాయి.

అసలు ముందు నుంచి కూడా నాగబాబు కి టీడీపీ పార్టీకి మధ్య కాస్త గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. అయితే కూటమి పొత్తుతో, ఆయన ఎమ్మెల్సీ పదవితో ఆ గ్యాప్ మాయమయ్యిందేమో అనుకుంటున్న సమయంలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి వైసీపీ పార్టీకి ఇంకాస్త ఆహారాన్ని అందించినట్టయింది. అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అంది వచ్చిన ఆహారాన్ని వదులుకుంటాయా.?

Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణే మరో పదిహేనేళ్ళు ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో కలిసే ఉంటాయని, అప్పటి వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగుతారని బలమైన సంకేతాలు పంపుతున్న ఈ తరుణంలో పవన్ అన్న నాగబాబే అందుకు భిన్నంగా మిత్రపక్ష పార్టీ నాయకుల మీద ఇలా వ్యంగ్యాస్త్రాలు సందిస్తే ఎలా.?

అందునా జనసేన పార్టీ అధినేత పవన్ కోసం తనకు బలమున్న సీటును కూడా త్యాగం చేసిన నేతను ఉద్దేశించి ఈ రకమైన వ్యంగ్యాస్త్రాలు, కౌంటర్లు వేయడం అది పవన్ నిర్ణయాన్ని అవమానించినట్టే అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ జనసేన నాయకులకు, ఆ పార్టీ క్యాడర్ కు పార్టీ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి బంధానికి కట్టుబడితే నాగబాబు మాత్రం తన అసందర్భ వ్యాఖ్యలతో కూటమి లోని టీడీపీ, జనసేన ల మధ్య అనవసరమైన వివాదాలు సృష్టిస్తున్నారు.

Also Read – ఆవేశంతో యుద్ధం చేస్తే అణు ప్రమాదం.. సిద్దమేనా?


వర్మ పై నాగబాబు చేసిన పరోక్ష వ్యాఖ్యలు గమనిస్తే ‘అవసరం తీరాక తెప్ప తగలేసే చందం’ అన్న సామెత జ్ఞప్తికి రాక మారదు. కూటమి పొత్తు కోసం పవన్ పడ్డ కష్టాన్ని ఆయన అన్న గా నాగబాబు క్షణాలలో ఆవిరిచేస్తున్నారు. పార్టీ కింద స్థాయి వ్యక్తులు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే సర్ది చెప్పాల్సిన నేతలే ఇలా బహింరంగా వేదికల మీద మిత్ర పక్షాల నేతల పై కౌంటర్లు వేస్తె పవన్ ఆశయం సాధ్యమేనా.? ఆలోచించాలి. నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయన రాజకీయ పరిణితి సాధించడానికి ఇంకాస్త సమయం అవసరమనిపిస్తుంది.