“చిరంజీవి తప్ప అందరూ బాగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు…” ఈ మాట అన్నది చిరంజీవి సోదరుడు నాగబాబే! అయితే అది చిరంజీవి నటించిన సినిమా గురించి కాదు. జూలై 3వ తేదీన భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్నవారి గురించి.
ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె. రోజా తదితరులు పాల్గొన్న ఆ సభకు చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే. వారిని ఉద్దేశ్యించే నాగబాబు ఈవిదంగా ట్వీట్ చేశారు.
ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,
ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
అయితే వారిలో ఎవరిని ఉద్దేశ్యించి ఆయన వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారనేదానిపై చర్చ మొదలైంది. ఆ సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని ఉద్దేశ్యించి ‘నా సోదరుడు’ అని సంభోదించారు. అది చాలా నాటకీయంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి వైసీపీ నేత కాదు కనీసం వైసీపీకి మద్దతు ఇవ్వడం లేదు. పైగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ నిత్యం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతుంటారు. మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి సిఎం జగన్మోహన్ రెడ్డికి సోదరుడు ఎలా అవుతారు?” అని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా సోదరుల మద్య మళ్ళీ చిచ్చుపెట్టే ప్రయత్నమే అని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆర్‌కె.రోజా ఆ సభలో కాస్త ఓవర్ యాక్షన్ చేశారని చెప్పవచ్చు. ఆమె ప్రధాని నరేంద్రమోడీతో, చిరంజీవితో సెల్ఫీలు తీసుకొన్నారు. మంత్రి పదవిలో ఉన్న ఆమె ప్రధాని నరేంద్రమోడీతో హుందాగా వ్యవహరించి ఉండాలి కానీ ఆయనతో సెల్ఫీ ఫోటో కోసం ఆరాటపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం జగన్మోహన్ రెడ్డి సభలో ఉన్నారనే కనీస స్పృహ కూడా లేకుండా తరువాత చిరంజీవితో సెల్ఫీలు తీసుకొన్నారు. కనుక నాగబాబు సిఎం జగన్మోహన్ రెడ్డిని, మంత్రి రోజాను ఉద్దేశ్యించే ఈ ట్వీట్ చేశారని భావించవచ్చు.



