రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన హైడ్రా గత పదిరోజులలో సుమారు 70కి పైగా భారీ అక్రమ కట్టడాలను కూల్చివేసింది. అయితే వాటిలో ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత ఒక్కటే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది సినీ నటుడు నాగార్జునది కావడమే కారణం.
తుమ్మిడికుంట చెరువులో కొంత ఆక్రమించి దానిని నిర్మించారు కనుక కూల్చివేశామని హైడ్రా చెపుతోంది. అది ప్రైవేట్ స్థలమే… ఒక్క గజం కూడా చెరువులో లేదు. అందుకే హైకోర్టు స్టే ఇచ్చిందని నాగార్జున వాదించారు. కానీ హైకోర్టుతో సహా ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదని ధృవీకరించుకున్న తర్వాతే కూల్చివేశామని హైడ్రా చెపుతోంది.
ఈ కూల్చివేతని సామాన్య ప్రజలు, ముఖ్యంగా స్థానికులు చాలా హర్షిస్తున్నారు. చెరువుని కబ్జా చేసి నిర్మించుకున్న మిగిలిన రాజకీయ నాయకుల ప్యాలస్‌లను కూడా కూల్చేయాలని కోరుతున్నారు.
ఇది నాగార్జునది కావడంతో వివిద కోణాలలో వస్తున్న విశ్లేషణలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హడావుడిగా ఆయనను కలిసి అభినందించిన సినీ పెద్దలు, రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, నంది అవార్డులకి బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించినా సినీ పెద్దలు స్పందించకపోవడం, ముఖ్యంగా నాగార్జున తదితరులు కేసీఆర్, కేటీఆర్‌తో అంటకాగుతుండటం వంటివన్నీ రేవంత్ రెడ్డికి ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. కనుక ఈవిధంగా సినీ పరిశ్రమకు తొలి హెచ్చరిక పంపారని ఓ విశ్లేషణ.
రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ నేతలే అని అందరికీ తెలుసు. అయితే ముందే వారి ఫామ్‌హౌస్‌లతో మొదలు పెడితే రాజకీయం అవుతుంది. కనుక ముందుగా ఇతరుల భవనాలతో మొదలుపెడితే ప్రజా స్పందన ఏవిదంగా ఉంటుందో తెలుస్తుంది.
‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేతపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది కనుక ఇప్పుడు బిఆర్ఎస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చేస్తే రాజకీయ కక్ష సాధింపని ప్రభుత్వాన్ని నిందించలేరు. పైగా వారే ప్రజల ముందు దోషులుగా తల దించుకోవలసి ఉంటుంది. కనుక ఇక నిర్మొహమాటంగా బిఆర్ఎస్ మీదకి బుల్డోజర్లు పంపించేయవచ్చనేది మరో విశ్లేషణ.
పంట రుణాలు మాఫీపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావుడితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. కనుక ప్రజల దృష్టిని మళ్ళించేందుకేఈ ‘హైడ్రా.. మా’ అని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి మరో కోణంలో విశ్లేషించారు.
నాగార్జున జోలికి వెళ్ళగలిగారు కానీ ఒకవేళ అదే చిరంజీవిదిఅయ్యుంటే దానిని టచ్ చేయగలిగేవారా?అని ఒకరికి ధర్మసందేహం కలిగింది.
కేసీఆర్ సినీ పరిశ్రమని ఎంత ఎద్దేవా చేసినా చివరికి అక్కున చేర్చుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమని బెదరగొట్టి ఏపీకి పారిపోయేలా చేస్తున్నారు కదా?అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
కనుక ఈ హైడ్రా… మాలో ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించుకోవాలనే నిబద్దత ఎంత శాతం? దీనిలో రాజకీయాలు ఎంత శాతం? వాస్తవాలు ఎంత శాతం? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు.




