ప్రిన్స్ మహేష్ బాబు సతీమణిగా నమ్రత శిరోద్కర్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముఖ్యంగా మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ ను నమ్రత డీల్ చేస్తోన్న నాటి నుండి అటు ట్రేడ్ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎక్కువగా వినపడుతోంది. అలాగే ఇటీవల కాలంలో మహేష్ దత్తత తీసుకున్న రెండు గ్రామాల అభివృద్ధిలో నమ్రత కీలక పాత్ర పోషిస్తుండడంతో, సాధారణ ప్రజానీకానికి కూడా నమ్రత చాలా చేరువ అయ్యింది.
ఒకప్పటి మిస్ ఇండియాగా వెలుగొందిన నమ్రత, హిందీ, తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ కు విడాకులు ఇచ్చేసిన ప్రిన్స్ సతీమణి, మళ్ళీ ఓ భారీ సినిమాలో నటిస్తోందన్న ప్రచారం ఇటీవల కాలంలో భారీ స్థాయిలో జరిగింది. కానీ, ఇదంతా కేవలం ఒక రూమర్ మాత్రమేనని, ఇలాంటి సిల్లీ పుకార్లను నమ్మవద్దని స్వయంగా నమ్రత చెప్పడంతో, ప్రిన్స్ సతీమణిగా రీ ఎంట్రీకి ఆస్కారం లేదన్న విషయం స్పష్టమైంది.
ప్రస్తుతం ఒక తల్లిగా పిల్లలను చూసుకుంటూ, ప్రిన్స్ సతీమణిగా మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ ను, మార్కెటింగ్ వ్యవహారాలను చూసుకుంటూ నిత్యం బిజీగా గడుపుతున్నానని, ప్రస్తుతానికి ఇదే తన జీవితమని, మళ్ళీ నటించే అవకాశం లేదని తేల్చిచెప్పింది. ఒక తల్లిగా అనుభవిస్తున్న మాధుర్యం మాటల్లో చెప్పలేనిదని, అది అనుభవిస్తేనే తెలుస్తుందని, నా తల్లితండ్రులు చూపించిన ప్రేమను నాడు అర్ధం చేసుకోలేకపోయానని, ఇప్పుడు అది తనకు తెలిసి వస్తోందని, గౌతమ్, సితారలను మానవతా విలువలతో పెంచడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చింది.



