చంద్రబాబు నాయుడు అరెస్టుని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండిస్తూ ట్వీట్ చేశారు. “ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది,” అని ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, “జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నం తినడం మానేసి కోర్టులలో చీవాట్లు ఎక్కువ తింటున్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులతో కాలక్షేపం చేసే వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల దౌర్భాగ్యం. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడుని కనీసం 16 నిమిషాలైనా జైలులో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్లు జగన్ తహతహలాడిపోతున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసినప్పుడు హైకోర్టు మీకు చీవాట్లు పెట్టింది కదా?స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 2.13 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72,000 మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు, దీనిని కుంభకోణం అని ఏవిదంగా అంటారని హైకోర్టు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాట వాస్తవమా కాదా?
ఒకవేళ అవినీతి జరిగిన్నట్లు మీరు భావిస్తున్నట్లయితే, ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా చంద్రబాబు నాయుడుని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు?ఇది రాజకీయ కక్ష సాధింపు కాదా?
అవినీతి మరక అంటని చంద్రబాబు నాయుడుకి దీంతో మారక అంటించాలని, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని జగన్ తహతహలాడిపోతున్నారు. అయితే ఈ అక్రమకేసులకు, అరెస్టులకు భయపడే వాళ్ళం కాము మేము. ఇటు న్యాయపోరాటం, అటు ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి మా నిజాయితీ నిరూపించుకొంటాము. రాష్ట్రంలో ప్రజలందరూ విపరీత పోకడలను, ఈ కక్షసాధింపు చర్యలను చూస్తూనే ఉన్నారు. కనుక ఎన్నికలలో వారే మీకు గుణపాఠం చెప్తారు,” అని అన్నారు.
—



