టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేసుకొంటూనే జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించి అన్ని జిల్లాలలో పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో ఎక్కడికక్కడ టిడిపి నేతలు సమరోత్సాహంతో దూసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగంగా నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నారు.
అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవారిని గుర్తించి వారితో మాట్లాడి మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తున్నారు. అవసరమైతే పార్టీలో సీనియర్ నేతలతో వారికి ఫోన్ చేయించి మాట్లాడించి నచ్చజెప్పుతున్నారు. ఇక పార్టీకి నష్టం కలిగించేవారిని కూడా ప్రత్యేకంగా గుర్తిస్తూ వారికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాట వినకుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారు.
అలాగే బాదుడే బాదుడు నిరసన కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండటంతో దానిని కొనసాగిస్తున్నారు. ఆ కార్యక్రమంతో పాటు నియోజకవర్గాలలో పార్టీ ఉనికిని స్పష్టంగా చాటిచెప్పేవిదంగా ర్యాలీలు, ప్రజా సమస్యలపై ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈరోజు నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అధ్వర్యంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు శ్రీనివాస సెంటర్‌లో నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ‘రైతు దగా’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తరువాత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం రైతులకు పధకాలు ఇస్తున్నామని చెపుతూ రైతులను ఏవిదంగా మోసం చేస్తోందో వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, టిడిపి మైనార్టీ అధ్యక్షుడు మౌలానా తదితరులు పాల్గొన్నారు.



