చంద్రబాబు నాయుడుకి మద్దతుగా శుక్రవారం రాత్రి రాజమండ్రిలో ‘బాబుతో నేను’ పేరిట కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మిణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మిణి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తాయి.
“నేను, మా అత్తగారు ఏనాడూ రాజకీయాలలోకి రాలేదు. కానీ నేడు ఇలా రోడ్లపైకి వచ్చేలా చేసింది వైసీపి ప్రభుత్వం. మేమే కాదు…. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది మహిళలు కూడా నేడు రోడ్లపైకి వస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు వలన నాలాగ ఎందరో యువతీయువకులు డిగ్రీలు చేసి ఐటి రంగంలో ఉద్యోగాలు సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డారు.
చంద్రబాబు నాయుడు యువతకు ఉన్నత చదువులు చదివి, ఐటి ఉద్యోగాలు సంపాదించుకొనేలా చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి అనేకమందికి ఉద్యోగాలు కల్పించారు. అలా ఆయన చేయడమే నేరమా? చంద్రబాబు నాయుడుకే ఈ దుస్థితి కలిగితే ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?ఈ ప్రశ్న నేను ఆయన కోడలుగా అడగటం లేదు. ఓ యువతిగా అడుగుతున్నాను.
ఆనాడు చంద్రబాబు నాయుడు యువతకు ఉన్నత చదువులు చదువుకొని, ఉద్యోగాలు సంపాదించుకొనేందుకు దారి చూపారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏమి చేస్తోంది?ఒక్క పరిశ్రమ, ఐటి కంపెనీని రప్పించలేకపోగా ఉన్నవాటిని కూడా పారిపోయేలా చేస్తోంది. కాలేజీ విద్యార్ధులకు గంజాయి, మద్యానికి అలవాటు పడుతూ జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. ఇదేనా మనం కోరుకొన్న రాష్ట్రం? పాలన?
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జిల్లా పర్యటనలకు, యువగళం పాదయాత్రకు అపూర్వమైన జనాధరణ లభిస్తుండటంతో ఆందోళన చెందిన వైసీపి ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ తప్పుడు కేసు పెట్టింది. నేడో రేపో నా భర్త నారా లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నామని వారే చెప్పుకొంటున్నారు. అంటే రాజకీయ కక్షతోనే ఈవిదంగా చేస్తోందని అర్దమవుతూనే ఉంది. ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఇప్పటికే స్పష్టమైంది. కనుక త్వరలోనే చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు,” అని బ్రాహ్మణి అన్నారు.
నారా బ్రాహ్మణి తొలిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పటికీ, ఆమె ఏమాత్రం తడబడకుండా ప్రభుత్వాన్ని ఇంత సూటిగా నిలదీసి ప్రశ్నించడం, విమర్శించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టిడిపి శ్రేణులే కాకుండా రాష్ట్రంలో మహిళలు, యువత అందరినీ నారా బ్రాహ్మిణి తన మాటలతో చాలా ఆలోచింపజేశారు.
నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను కూడా రోడ్లపైకి రావలసిన పరిస్థితి కల్పించింది జగన్ ప్రభుత్వం. దీని వలన చంద్రబాబు నాయుడుకి మరింత మద్దతు పెరుగుతుంది. బహుశః వైసీపి ఇది ఊహించి ఉండకపోవచ్చు.
ఒక్కరి పగ ప్రతీకారాలకు వైసీపిలో అందరూ మూల్యం చెల్లించాల్సిరాబోతుండటం ఆలోచించాల్సిన విషయమే. కానీ వైసీపి నేతలకు తమ పరిస్థితి ఇంకా అర్దమైన్నట్లు లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనుకోవాలేమో?