ఈరోజు టిడిపి అధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్టీఆర్ స్పూర్తి-చంద్రన్న భరోసా పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ విధానాలను చాలా నిశితంగా విమర్శించారు. సభలో ప్రసంగిస్తూ, “ఆనాడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మా ప్రభుత్వం గురించి ఎంతగా దుష్ప్రచారం చేసినప్పటికీ మేము ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఆగిపోయాము. అదే… ఆ రోజు మేము కాదనుకొంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా?
కానీ ఇప్పుడు మేము ఆయన ప్రభుత్వ విధానాలను, వైఖరిని ప్రశ్నిస్తుంటే భరించలేకపోతున్నారు. ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించి వేదిస్తున్నారు. చివరికి మా పార్టీ కార్యకర్తలును కూడా విడిచిపెట్టకుండా వేదిస్తున్నారు. జగన్ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంతకాలం పరిపాలిస్తారో మేమూ చూస్తాం.
ఆనాడు పాదయాత్రలో దొరికినవారందరికీ ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడు అన్నిటి ఛార్జీలు పెంచేసి వారినే పిడిగుద్దులు గుద్దుతున్నారు. విద్యుత్, ఆర్టీసీ, ఇంటిపన్నులు అన్నీ పెంచేస్తూ సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు.
అమ్మఒడి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ రకరకాల ఆంక్షలు పెట్టి ఆ అమ్మలను కూడా మోసం చేస్తున్నారు. అమ్మఒడి ఓ బూటకం…ఇంగ్లీష్ మీడియం ఓ నాటకం…నాడు-నేడు కార్యక్రమం అవినీతిమయం. మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పేద పిల్లలందరూ చదువుకోవాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ పాఠశాలలు నిర్మించాము. కానీ జగన్ ప్రభుత్వం ఉన్న పాఠశాలలను ఒకటొకటిగా మూసేస్తూ పిల్లలను విద్యకు దూరం చేస్తోంది. అయినా నిసిగ్గుగా తమ ప్రభుత్వం విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోందని అబద్దాలు చెప్పుకొంటున్నారు.
అసలు జగన్మోహన్ రెడ్డి సమస్యలను పరిష్కరించడం మాట దేవుడెరుగు… కొత్త సమస్యలు సృష్టించకుండా ఉంటే చాలని అందరూ కోరుకొంటున్నారు. మూడేళ్ళుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఇసుక, మద్యం, సినిమా టికెట్లు ప్రతీ వ్యాపారాన్ని జగన్ ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది.
ప్రజలకు కూడా ఓపిక నశించిపోతోంది. ఎన్నడూ లేనివిదంగా ఈసారి ప్రజలు కూడా ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఇలా ఇంటికొకరు వచ్చి పోరాడేందుకు ముందుకు రావాలి,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.



