Nara-Lokesh-Chandrababu-Naidu-Arrestటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడే, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌తో సహా టిడిపి ముఖ్యనేతలందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తామని, వారి కోసం చాలా కేసులు సిద్దం చేసి లైన్లో పెట్టామని, ఒకవేళ ఓ కేసులో బెయిల్ తీసుకొని వారు బయటకు వస్తే వెంటనే మరో కేసులో లోనికి పంపిస్తూనే ఉంటామని మంత్రి రోజా కుండ బద్దలు కొట్టేశారు.

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ వేడి తగ్గింది. చంద్రబాబు నాయుడు అంతటివాడినే అరెస్ట్ చేసి జైల్లో వేసినా కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు, టిడిపి కూడా ఏమీ చేయాలేకపోవడంతో వైసీపి ప్రభుత్వానికి ఇప్పుడు చాలా ధైర్యం వచ్చిందని మీడియా ముందుకు వచ్చి చెలరేగిపోతున్న మంత్రుల మాటలు వింటే అర్దమవుతోంది.

కనుక మంత్రి రోజా చెప్పిన్నట్లుగా ఇప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్‌పై కేసు నమోదు చేసి ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి రాగానే అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడి అధికారులు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది టిడిపికి చాలా ఆందోళన కలిగించే విషయమే. కానీ ఎదుర్కోక తప్పదు.

ఒకవేళ నారా లోకేశ్‌ను, ఆ తర్వాత ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుని కూడా జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే అప్పుడు టిడిపిని ఎవరు ముందుండి నడిపిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. నందమూరి బాలకృష్ణ త్వరలోనే తాను ప్రజల మద్యకు వస్తానని చెప్పారు. కానీ ఆయన వైసీపి కపట ఎత్తుగడలని ఎదుర్కొలేకపోవచ్చు. బహుశః టిడిపి సీనియర్ నేతలందరూ కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొంటూ పార్టీని కాపాడుకొంటూనే వైసీపిని ధీటుగా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఒకవేళ ఈలోగా సుప్రీంకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ అరెస్టులను అడ్డుకొంటే టిడిపి ఒడ్డున పడుతుంది లేకుంటే మరిన్ని అగ్నిపరీక్షలు తప్పకపోవచ్చు.