అందరూ మనవాళ్ళే… కడపలో లోకేష్‌ రెడ్డికి జేజేలు!

Nara Lokesh Meeting With Reddy Community in Kamalapuramఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో, పార్టీలో, వివిద కమీషన్లలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ లభించింది. ఇది సహజమే. అయితే రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రజలందరికీ అంతే ప్రాధాన్యం, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పధకాలలో అవకాశాలు లభించాయా?రాష్ట్రాన్ని రెడ్లు పాలిస్తున్నారు కనుక రాష్ట్రంలో రెడ్లందరి జీవితాలు వెలిగిపోతున్నాయా?అంటే కాదని అందరికీ తెలుసు.

వైసీపీ టిడిపి మీద కమ్మ, కామందుల ముద్ర వేసింది. చివరికి అమరావతిపై కూడా కులం, పార్టీ ముద్ర వేసి పక్కన పడేసింది. కమ్మవారి బాగోగులు, వారి ఓట్లు కూడా మాకు అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తోంది. కానీ టిడిపి మాత్రం రెడ్లతో సహా క్రీస్టియన్, మైనార్టీలు, బడుగు బలహీనవర్గాల ప్రజలందరూ మా వాళ్ళే అనుకొంటోంది. ఇదే టిడిపిని ప్రజలకు చేరువ చేస్తోందని చెప్పొచ్చు.

ADVERTISEMENT

కడప, కర్నూలు జిల్లాలలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువమంది ఉన్నారు. వారిలో మద్యతరగతి, దిగువ మద్య తరగతి, కాయకష్టం చేసుకొని కడుపుకొంటున్నవారు చాలామందే ఉన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ పదవులు లభించాయి. కానీ ఆ పదవులు దక్కించుకొన్నవారు, వారి కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప రాష్ట్రంలో సామాన్య స్థాయిలోని రెడ్ల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదు.

రెడ్లు ఉన్నత కులానికి చెందినవారుగా పరిగణింపబడుతుంటారు కనుక వారికి ఎటువంటి సంక్షేమ పధకాలు అందవు. ఏ ఆర్ధిక సాయానికి నోచుకోరు. ప్రభుత్వం వారి కోసం కార్పొరేషనో, కమీషనో ఏర్పాటు చేసినప్పటికీ, అది కంటి తుడుపు చర్య మాత్రమే. మానవాళ్ళే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని గొప్పగా చెప్పుకోవడం తప్ప మరే ప్రయోజనమూ లేదు.

వైసీపీ కూడా రెడ్ల ఓట్లతో అధికారంలోకి రాగలిగింది. రాష్ట్రాన్ని రెడ్లే పాలిస్తున్నప్పటికీ వారి జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదు. బిజెపి కూడా వారి ఓటు బ్యాంక్‌పై కన్నేసింది. అందుకే కిరణ్‌ కుమార్‌ రెడ్డిని తీసుకువచ్చింది. ఇలా అన్ని పార్టీలు కూడా వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసాయే తప్ప వారికి తోడ్పడలేదు.

ఇటువంటి సమయంలో టిడిపి యువనేత నారా లోకేష్‌ కడప, కర్నూలు జిల్లాలలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, పేదరికం, ఇంకా అనేక సమస్యలతో బాధలుపడుతున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రజలతో ముఖాముఖీ సమావేశమై వారి పరిస్థితులు తెలుసుకొని చలించిపోయారు.

వారు కూడా రాష్ట్రంలో మిగిలిన కులమతాల ప్రజల్లాగే నానా ఇబ్బందులు పడుతున్నందున, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి కోసం ప్రత్యేకంగా పధకాలు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. టిడిపి ఏదో ఓ కులానికి, మతానికి ప్రాతినిద్యం వహించడంలేదని, రాష్ట్రంలో అన్ని కులమతాల ప్రజలను కలుపుకుపోయే పార్టీ అని,వారిలో రెడ్లు కూడా ఉన్నారని నారా లోకేష్‌ వారికి వివరించారు.

నారా లోకేష్‌ అంత ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడుతూ తమలో ఒకరిగా కలిసిపోవడంతో ఆ సమావేశంలో కొందరు లోకేష్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ విధంగా తనను వారిలో ఒకరిగా భావించి కలుపుకొన్నందుకు నారా లోకేష్‌ వారికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఇంతకాలం పార్టీలు మనుషులను మనుషులుగా కాకుండా కులమతాల వారీగానే చూస్తూ తదనుగుణంగా రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ఈవిదంగా బీసీ, ఏసీ, ఎస్టీ, మైనార్టీలు మొదలు రెడ్లవరకు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు. వారిని విడివిడిగా ఉంచితేనే ఓట్లు రాలుతాయనుకొన్నాయి.

కానీ రాజకీయాలలో యువతరం ఆలోచనలు భిన్నంగా ఉంటాయని నారా లోకేష్‌ నిరూపించి చూపుతున్నారు. వైసీపీ కంచుకోట కడపలో ఇంతవరకు వైసీపీ, టిడిపిల మద్య ప్రజలు చీలిపోయి ఉన్నారు. కానీ నారా లోకేష్‌ వారందరినీ టిడిపి గొడుగు క్రింద ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన సభలు, సమావేశాలు, రోడ్ షోలకు వస్తున్న అపూర్వమైన ప్రజాధారణ చూస్తుంటే కడప ప్రజలు పునరాలోచన చేయబోతున్నారని స్పష్టం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories