టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పక్షం ఆకాశమే హద్దుగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను మట్టుపెట్టాలనే తలంపుతో యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘చంద్రబాబు విడుదల’ అన్న అంశం ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో, నారా లోకేష్ పార్టీ పెద్ద దిక్కుగా మారారు.
అయితే నారా లోకేష్ అరెస్ట్ కు కూడా రంగం సిద్ధమవుతోందనేది లేటెస్ట్ న్యూస్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14గా పేర్కొంటూ ఏసీబీ కోర్ట్ లో సీఐడీ దాఖలు చేసిన మెమోలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, నారాయణ, రామకృష్ణ హోసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని రమేష్ తదితరులను ఎఫ్ఐఆర్ లో ఉన్నారు.
తాజాగా చేరిన నారా లోకేష్ పేరు దేనికి సంకేతాలు? అంటే చంద్రబాబు అరెస్ట్ గుర్తుకు రాక తప్పదు. ఎలాంటి విచారణ చేయకుండా, ఎఫ్ఐఆర్ లో పేరును చేర్చకుండా చంద్రబాబును ఏ విధంగా అరెస్ట్ చేసారో అందరికి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి, ఇది ప్రభుత్వ కక్షగా ప్రజల్లోకి వెళ్ళింది.
కానీ ప్రస్తుతం నారా లోకేష్ పేరును ముందుగానే ఎఫ్ఐఆర్ లో చేర్చడం అనేది, తదుపరి కార్యాచరణను వైసీపీ సిద్ధం చేసిందా? అన్న అనుమానాలను తావిస్తోంది. లోకేష్ కూడా అరెస్ట్ కాబోతున్నారని వైసీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు మీడియా ముఖ్యంగా ప్రస్తావించిన వైనం తెలిసిందే. బహుశా త్వరలో ఇది అధికారికం కాబోతున్నట్లుగా కనపడుతోంది.



