టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో మొదట షాక్ అయిన టిడిపి నేతలు, మూడు రోజులలోనే తేరుకొని రకరకాల వ్యూహాలతో జగన్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ, ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డినే దోషిగా నిలిపేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఈ కష్టకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ముందుకు వచ్చి వచ్చే ఎన్నికలలో టిడిపితో కలిసి పోటీ చేస్తామని నిన్న ప్రకటించడం వైసీపికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇంతకాలం టిడిపి-జనసేనల పొత్తులపై అస్పష్టత ఉండేది. కానీ వైసీపి పుణ్యమాని రెండు పార్టీలు పొత్తులు ఒక్కదెబ్బతో ఖరారు అయిపోయాయి.
మరో కీలకపరిణామం, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిన్న సాయంత్రం రాజమండ్రి నుంచే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరడం. ఆయనతో పాటు టిడిపి ఎంపీ రామ్మోహన్నాయుడు కూడా ఢిల్లీకి వెళ్ళారు.
వారు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఏపీలో జగన్ ప్రభుత్వం ఆరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, హత్యారాజకీయాల గురించి జాతీయ మీడియాతో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది జగన్ ప్రభుత్వం ఊహించని పరిణామమే.
చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినందునే జైల్లో వేశామని జాతీయమీడియాకు లీకులు ఇస్తూ ఇన్నిరోజులు దుష్ప్రచారం చేస్తున్న వైసీపికి, నారా లోకేష్ స్వయంగా ఢిల్లీకి వెళ్ళి జాతీయ మీడియాతో మాట్లాడతారని ఊహించి ఉండదు. ఇప్పటికే పలువురు జాతీయస్థాయి నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తున్నారు. కనుక నారా లోకేష్ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే ఆయన చెప్పేవాటికి జాతీయ మీడియా చాలా ప్రాధాన్యం ఇస్తుంది.
ఇక మరో ఊహించని పరిణామం ఏమిటంటే, ఇంతకాలం నారా లోకేష్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు నారా లోకేష్‌ని జాతీయ స్థాయి రాజకీయనాయకుడిగా వైసీపియే ప్రమోట్ చేసిందని చెప్పవచ్చు. నారా లోకేష్ ఢిల్లీలో జాతీయస్థాయి నేతలను కలిసి వారితో వరుస సమావేశాలు కాబోతున్నారు. బహుశః ఇది టిడిపిని ఇండియా కూటమికి దగ్గర చేసినా ఆశ్చర్యం లేదు. ఇదీ వైసీపి పుణ్యమే.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు అపాయింట్మెంట్స్ కోరిననట్లు సమాచారం. ఒకవేళ వారిరువురికీ అపాయింట్మెంట్స్ లభిస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్, టిడిపితో బీజేపీ పొత్తుల విషయంలో కూడా కేంద్రం వైఖరి ఏమిటో కూడా స్పష్టం అయిపోతుంది. ఇదీ వైసీపి పుణ్యమే.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగానే టిడిపి ఎంపీలు హడావుడిగా ఢిల్లీకి పరుగులు తీసి మోడీ, అమిత్ షాల కాళ్ళపై పడి వేడుకొంటారని వైసీపి భావించింది తప్ప నారా లోకేష్ స్వయంగా ఢిల్లీకి బయలుదేరుతారని, అక్కడ ఇటువంటి పరిణామాలు జరవచ్చని బహుశః ఊహించి ఉండదు. కనుక ఇది ఖచ్ఛితంగా వైసీపికి పెద్ద షాక్ అనే చెప్పాలి.
జగన్ కూడా మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన కంటే ముందు ఢిల్లీ చేరుకొన్న నారా లోకేష్ అక్కడి పరిస్థితిని తారుమారు చేస్తే జగన్‌కు చాలా ఇబ్బందికరంగానే మారవచ్చు. వ్యూహం అంటే ఇది కదా?