ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హిందీ భాష పై తీవ్ర చర్చ జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి ఐటీ మంత్రి నారా లోకేష్ వరకు అందరు హిందీ భాష పై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలుగు భాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ పేర్కొనగా, లోకేష్ హిందీ జాతీయ భాష అంటూ ప్రకటించారు. అయితే బీజేపీ లేవనెత్తుకున్న ఈ భాష వివాదానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
నేడు ఢిల్లీలో లో మాజీ ప్రధాని పివి నరసింహ రావు సంస్కరణ సభలో ప్రసంగించిన బాబు బహు భాష ప్రాముఖ్యతను చాల స్పష్టంగా వివరించారు. మాజీ ప్రధాని పీవీ బహు భాష ప్రావీణ్యుడని, ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ తో పాటుగా మొత్తం 17 భాషల పై పూర్తి పట్టు ఉందని అందుకే పీవీ అంత గొప్ప వ్యక్తిగా ఎదగగలిగారు అంటూ కొనియాడారు.
అధునాత కాలంలో మాతృ భాషను గౌరవించడంతో పాటుగా ఇతర భాషలను నేర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదనే భావన వచ్చేలా బాబు ప్రసంగం సాగింది. అయితే ఇక్కడ హిందీ భాష నేర్చుకోవడం పై ఎవరు ఎవరి పై బలవంతపు ఒత్తిడి తీసుకురావడం లేదు.
బహు భాష ప్రావీణ్యత అనేది ఎప్పటికైనా ఉపయోగమే తప్ప నిష్ప్రయోజనం కాదు. అయితే ఈ భాష విధానం పై బీజేపీ నుంచి ఇతర రాజకీయ పార్టీల వరకు రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం.




