జగన్‌ చేయలేని పని లోకేష్‌ చేసి చూపారుగా!

Nara Lokeshకొంతమంది రాజకీయ నాయకులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాను ఎదుర్కోలేరు. అటువంటి వారిలో ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒకరు. ఆయన బటన్ నొక్కుడు సభలలో ఎంతసేపైనా మాట్లాడగలరు. ఎందుకంటే అక్కడ తను చెప్పేది విని చప్పట్లు కొట్టేవారే తప్ప ప్రశ్నించేవాళ్ళు ఉండరు కనుక.

అదే… ప్రెస్‌మీట్‌లో అయితే ఎవరు ఏ ప్రశ్న సందిస్తారో తెలీదు. వాటికి జవాబు చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా వైసీపి పాలన చూసిన తర్వాత అడిగేందుకు వేలాది సమాధానం లేని ప్రశ్నలున్నాయి. కనుక ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో జగన్మోహన్‌ రెడ్డి ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాను ఒంటరిగా ఎదుర్కోలేదని అందరికీ తెలుసు. కానీ సింహం సింగిల్‌గానే వస్తుందనే డైలాగ్ చెప్పడం మరిచిపోరు.

ADVERTISEMENT

జగన్‌ చేయలేకపోయిన ఈ పనిని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఒక్కసారి కాదు… యువగళం పాదయాత్రలో కనీసం ఓ వందసార్లు చేసి ఉంటారు. ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు, ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు, హలో లోకేష్ వంటి కార్యక్రమాలలో తనను అనేక అంశాలపై ప్రశ్నించే మీడియా ప్రతినిధులను, వివిద వర్గాల ప్రజలను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొని సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి మెప్పించిన సంగతి తెలిసిందే.

యువగళంలో ఆ అనుభవమే ఇప్పుడు ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. వైసీపి నుంచి తప్పుడు సమాచారం అందుకొన్న జాతీయమీడియా ప్రతినిధులు నారా లోకేష్‌ మీద ఆకలిగొన్న సింహాల్లా ప్రశ్నల వర్షం కురిపించారు.

“మీ తండ్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి జైలుకి వెళితే మీరు ఏవిదంగా ఆయనను సమర్ధిస్తున్నారు?” అని ప్రశ్నించినప్పుడు ఇదివరకైతే నారా లోకేష్‌ తడబడేవారేమో కానీ ఇప్పుడు ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా సమాధానం చెప్పారు.

చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న ఏపీ సీఐడీ కూడా చంద్రబాబు నాయుడు నేరం చేశారని నిరూపించే ఒక్క సాక్ష్యం చూపించలేకపోయిందని, అందుకే ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేయడానికి భయపడిందన్నారు.

కానీ తన తండ్రి అవినీతికి పాల్పడలేదని నిరూపించేందుకు తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటితో న్యాయపోరాటం చేసి విడిపించుకొంటానని చెప్పారు.

చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, ఐటి కంపెనీలు, పరిశ్రమలే తప్ప అవినీతికాదని ఈ విషయం జాతీయమీడియాలో కూడా అనేకమార్లు వచ్చిన వార్తలే ఇందుకు నిదర్శనం అని నారా లోకేష్‌ అన్నారు.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళుగా తమను ఎంతగా వేధిస్తోందో ఈ సందర్భంగా నారా లోకేష్‌ జాతీయ మీడియాకు వివరించి ఈ వేధింపులకు పరాకాష్టగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిందని అన్నారు. ఇక ముందుకు కూడా టిడిపి నేతలందరిపై అనేక కేసులు పెట్టి వేధించబోతున్నామని ఏపీ మంత్రులే స్వయంగా చెప్పుకొంటున్న విషయాన్ని నారా లోకేష్‌ జాతీయ మీడియాకు తెలియజేశారు.

ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి అప్పులు, ఆరాచకాలు పెరిగిపోయాయని నారా లోకేష్‌ వివరించారు. చంద్రబాబు నాయుడుకి న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు వస్తారని అన్నారు.

ఒకప్పుడు ప్రజల మద్యకు వెళ్ళి మాట్లాడాలంటే తడబడే నారా లోకేష్‌ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ జాతీయ మీడియాను పిలిచి మరీ ఒంటరిగా ఎదుర్కొన్నారు. గత ఎన్నికలలో వైసీపి నేతలు నారా లోకేష్‌ను ‘పప్పు, పప్పు’ అంటూ ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలుసు.

అప్పటి నుంచే నారా లోకేష్‌ తనను తాను మలుచుకొంటూ నేడు ఈ స్థాయికి ఎదిగారు. నారా లోకేష్‌ తన తండ్రిలాగే కష్టాలకు, సవాళ్ళకు ఎదురీది అన్నీ నేర్చుకొన్నారు. కానీ ఎలుక తోలు ఎంతగా ఉతికినా మారదన్నట్లు ఈ నాలుగేళ్ళలో వైసీపి నేతలు నేర్చుకొన్నది శూన్యం. వారు నేర్చుకొన్నది ఒక్కటే.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మాట్లాడటం. మంత్రులు తమ శాఖల గురించి, నేతలు సంక్షేమ పధకాల గురించి సాధికారంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories