కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారీ ఇటీవల తెలంగాణలో జరిగిన మేడారం మహా జాతరలో ‘కోవా-బన్’ బండి పెట్టుకొని అమ్ముకుంటుంటే, కొంతమంది యూట్యూబర్లు తమ రీల్స్, లైక్స్ కోసం అతనిని చాలా దారుణంగా అవమానించారు.
పది రూపాయలకి బన్నే రాదు… కోవా ఎలా ఇస్తున్నావు? ఏం కలిపి కోవా తయారు చేశావు? ఈ బన్నులు ఏమిటి ఇంత ఉబ్బిపోయున్నాయి? అసలు ఇవి తినడానికి పనికి వస్తాయా? ఇలాంటి వాటిని తెచ్చి భక్తుల ప్రాణాలతో ఆటలాడుతున్నావా?” అంటూ అతనిపై దాడి చేశారు.
ఆ బన్నులను బలవంతంగా అతని చేత తినిపించి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.
అలాంటి నాసిరకం ఆహార పదార్ధాలతో భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెట్టడం సరికాదని, అతనిపై తక్షణం కటిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
అయితే పొట్ట కూటి కోసం వచ్చిన ఓ చిరు వ్యాపారిపై మీ రీల్స్, లైక్స్ కోసం మతం పేరుతో ఇంతగా అవమానిస్తారా? ఇది చాలా హేయమైన చర్య. రీల్స్ కోసం అందరినీ ఇలా బ్లాక్ మెయిల్స్ చేస్తున్న ఆ యూట్యూబర్లపై ముందు కటిన చర్యలు తీసుకోవాలి,” అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందిస్తూ, “డియర్ బ్రదర్ వలీ! నీకు జరిగినదానికి నేను చాలా చింతిస్తున్నాను. మతం ప్రాతిపదికగా కొందరు ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగువారిలో ఇలాంటి మత వివక్షకు చోటు లేదు. అందరూ కలిసికట్టుగా ఉంటారు. పరస్పరం గౌరవించుకుంటారు. త్వరలోనే నేను వచ్చి నీ కోవా-బన్ రుచి చూడాలనుకుంటున్నాను,” అని ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా అనేకమంది రోడ్ల పక్కన, తోపుడు బళ్ళపై రకరకాల ఆహార పదార్ధాలు అమ్ముకుంటారు. ఇక బేకరీలు, స్వీట్ షాపులు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ప్రతీ చోట అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ ఇలా ఎవరినీ ఎవరూ నిలదీయరు.
పైగా కొందరు యూట్యూబర్స్ స్వయంగా ఫలానా చోట ఇడ్లీలు బాగుంటాయి… ఫలానా చోట చికెన్ బాగుంది… ఫలానా చోట వేడి వేడి పుణుకులు తిన్నారా లేదా?అంటూ సోషల్ మీడియాలో వీడియోలు, వారి ఇంటర్వ్యూలు అప్‌లోడ్ చేస్తుంటారు. తద్వారా వారి వ్యాపారాలకు ఎంతో కొంత తోడ్పడినవారవుతారు.
కానీ కొందరు ఇలా రీల్స్, లైక్స్ కోసం ఒక పేదవాడిని దారుణంగా అవమానించడానికి వెనకాడలేదు. ఇలాంటి వాళ్ళు వెళ్ళి తిరుమల కల్తీ నెయ్యిపై ఇంటర్వ్యూలు, రీల్స్ చేసే సాహసం చేయగలరా?
కనుక మంత్రి నారా లోకేష్ ఈవిధంగా అతనికి బాసటగా నిలవడం చాలా అభినందనీయం. ఆయన ఇలా స్పందించడంపై కూడా కోడి గుడ్డుకి ఈకలు పీకేవారు తప్పక ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోనవసరం లేదు!




