టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 14న ఢిల్లీకి వెళ్ళారు. ఈ వారం రోజులలో జాతీయమీడియాకు ఇంటర్వ్యూలు, టిడిపి ఎంపీలతో కలిసి నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చాక ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడాలనుకొంటున్నారు. కనుక ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎప్పుడు బయలుదేరుతారో ఇంకా తెలీదు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ రావడం ఇంకా ఆలస్యమైతే టిడిపి ఎంపీలను వెంటబెట్టుకొని మోడీ, అమిత్ షాలను కలిసి మాట్లాడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. కనుక 23 తర్వాత ఎప్పుడైనా వారికి మోడీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉంటుంది. కనుక అంతవరకు నారా లోకేశ్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ లభించకపోతే నారా లోకేశ్ ఢిల్లీ నుంచి తిరిగి బయలుదేరవలసి ఉంటుంది.
విజయవాడ చేరుకోగానే నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసుతో సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో నారా లోకేశ్ ఇంకా ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉంటే అరెస్ట్ కాకుండా తప్పించుకొనేందుకే అక్కడ దాక్కొన్నారని వైసీపి దుష్ప్రచారం మొదలుపెట్టవచ్చు.
ప్రస్తుతం టిడిపి క్లిష్ట పరిస్థితులు ఉన్నందున నారా లోకేశ్ బయట ఉండటం చాలా అవసరమే కానీ తిరిగివచ్చి ధైర్యంగా కేసులు ఎదుర్కోవడం కూడా అంతే ముఖ్యం. లేకుంటే అది కూడా వైసీపికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక నారా లోకేశ్ అవసరమైతే ముందస్తు బెయిల్ తీసుకొనైనా రాష్ట్రానికి తిరిగి రావడం చాలా అవసరం.
ముఖ్యంగా వీలైనంత త్వరగా యువగళం పాదయాత్రను పునః ప్రారంభించడం చాలా అవసరం. తద్వారా టిడిపి శ్రేణులలో మళ్ళీ ఉత్సాహం, పోరాటస్పూరిని రగిలించగలుగుతారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిందని రాష్ట్ర ప్రజలకు చెప్పుకొనే అవకాశం యువగళం పాదయాత్రతో లభిస్తుంది. కనుక నారా లోకేశ్ వీలైనంత త్వరగా రాష్ట్రానికి తిరిగిరావడమే మంచిది.



