పలాస జీడిపప్పు కాదు మమ్మల్ని నమిలేయడానికి: టిడిపి

Nara Lokesh visit to Palasa obstructed by the policeరాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి టిడిపి నేతలను ఏదోవిదంగా వేధిస్తూనే ఉంది. రాజకీయకక్ష సాధిస్తూనే ఉంది. రెండు నెలల క్రితం నర్సీపట్నంలో టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి కుమారుల ఇంటిని అర్దరాత్రి జేసీబీలతో కూల్చివేసేందుకు ప్రయత్నించి హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొంది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాసలో టిడిపికి చెందిన 27వ వార్డు కౌన్సిలర్ సూర్యనారాయణ చెరువును ఆక్రమించి ఇల్లు కట్టుకొన్నారని ఆరోపిస్తూ గురువారం రాత్రి దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించగా స్థానిక టిడిపి కార్యకర్తలు వారిని అడ్డుకొన్నారు.

మరోపక్క టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గం ఇన్‌ఛార్జి గౌత్ శిరీషను స్థానిక వైసీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కొలేక ఆమె మంత్రి సీదిరి అప్పలరాజును ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడారని, మంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే పట్టణంలోని టిడిపి కార్యాలయాన్ని ఆదివారం ముట్టడిస్తామని స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు.

ADVERTISEMENT

కానీ వారి బెదిరింపులకు గౌతు శిరీష కూడా ఏమాత్రం భయపడలేదు. “నేను ఇక్కడే టిడిపి కార్యాలయంలో కూర్చొని ఉంటాను. వైసీపీ గూండాలు ఎంతమంది వచ్చినా భయపడేది లేదు.. ఇక్కడి నుంచి కదిలేది లేదు. మేమేమీ పలాస జీడిపప్పు కాదు వైసీపీవాళ్ళు మమ్మల్ని నమిలేయడానికి,” అని ధీటుగా జవాబిచ్చి టిడిపి కార్యాలయంలో కూర్చోన్నారు. వైసీపీ కార్యకర్తలు టిడిపి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నిస్తున్నారని తెలిసి, టిడిపి కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో తమ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. దీంతో ఆదివారం పలాసలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పలాసలో టిడిపి నేతలపై వైసీపీ దౌర్జన్యాల గురించి తెలుసుకొన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఆదివారం విమానంలో విశాఖకు చేరుకొని పలాసకు రోడ్డు మార్గంలో పలాసకు వెళుతుండగా, శ్రీకాకుళం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకొని వెనక్కు వెళ్లిపోవాలని సూచించారు. నారా లోకేష్‌ వస్తున్న సంగతి తెలుసుకొని అప్పటికే భారీ సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో, పోలీసులకు వారికీ మద్య తోపులాటలు జరిగాయి.

పోలీసులు అడ్డుకోవడంతో నారా లోకేష్‌, టిడిపి నేతలు కళా వెంకట్రావు, చిన్న రాజప్ప తదితరులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. “పలాసలో మా పార్టీ నేత ఇల్లు కూల్చివేస్తూ, పార్టీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే వారిని అడ్డుకోవవలసిన మీరు మమ్మల్ని ఎందుకు అద్దుకొంటున్నారని,” నారా లోకేష్‌ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు నారా లోకేష్‌ను అదుపులో తీసుకొని శ్రీకాకుళం నుంచి వెనక్కు తీసుకువెళ్లి విశాఖకు వెళ్ళేదారిలో రణస్థలం వద్ద విడిచిపెట్టారు. కళా వెంకట్రావు, చిన్న రాజప్ప తదితరులను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పలాసలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories