యువగళం పాదయాత్ర 195వ రోజు @ 2600 కిమీ

Nara-Lokesh-2000-KMSటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో చూస్తుండగానే ఆరున్నర నెలలు గడిచిపోయాయి. శనివారం 195వ రోజున నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం సింహాద్రిపురం వద్ద 2,600 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన శిలాఫలకాన్ని అక్కడ ఆవిష్కరించారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక రెండేళ్ళలో చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని పూర్తిచేసి, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని నారా లోకేష్‌ టిడిపి తరపున హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

నారా లోకేష్‌ పాదయాత్ర వలన టిడిపికి ఒరిగేది, వైసీపీ తరిగేదీ ఏమీ ఉండబోదని వైసీపీ నేతలు చెప్పుకొంటున్నారు. కానీ మొన్న కృష్ణాజిల్లాలో నారా లోకేష్‌ అడుగుపెట్టిన్నప్పుడు, పాదయాత్ర మార్గంలో ఫ్లెక్సీ బ్యానర్ పెట్టి, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.

నిన్న రాత్రి నూజివీడులో పాదయాత్ర చేస్తునప్పుడు, వైసీపీకి చెందినవారు నారా లోకేష్‌ వచ్చే మార్గంలో ముందుగానే స్ట్రీట్ లైట్లన్నీ ఆర్పేసి, ఆయన ముందుకు సాగిన తర్వాత మళ్ళీ వెలిగించడాన్ని చూసి స్థానికులే ఛీదరించుకొన్నారు.

నారా లోకేష్‌కు స్వాగతం చెపుతూ నూజివీడు టిడిపి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానరుని వాలంటీర్లు చించివేస్తుండగా చూసి, టిడిపి కార్యకర్తలు వారిని చితకబాది అక్కడి నుంచి తరిమేశారు.

నారా లోకేష్‌ పాదయాత్ర వలన వైసీపీకి నష్టం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు?

నారా లోకేష్‌ పాదయాత్ర మొదలుపెట్టిన కొత్తలో ఆయనను వైసీపీ కార్యకర్తల చేత అడ్డగిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని భావించిన వైసీపీ నేతలు, జీవో నంబర్:1 పేరుతో పోలీసులతో నారా లోకేష్‌ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

నారా లోకేష్‌ వెంట వందలాదిగా జనాలు కలిసి నడుస్తున్నప్పుడు పోలీసులు ఆయనను అడ్డుకొనేందుకు ప్రయత్నించేవారు. అప్పుడు నారా లోకేష్‌ రాజ్యాంగం పుస్తకం చూపిస్తూ, “మీరు దీనికి కట్టుబడి ఉన్నారా లేదా? దీని ప్రకారమే పనిచేస్తున్నారా లేక జగన్‌ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారో చెప్పాలి. ఒకవేళ దీనికి మీరు కట్టుబడకపోతే నేను కోర్టులో తేల్చుకొంటాను. మీరు సిద్దమేనా?,” అంటూ పోలీసులనే ఎదురు నిలదీయడం మొదలుపెట్టేసరికి వారు తడబడుతుండేవారు.

ఈ వార్తలు, వీడియోలు అన్నీన్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ లో విస్తృతంగా వస్తుండటంతో తామే నారా లోకేష్‌ పాదయాత్రకు ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్నామని వైసీపీ ఆలస్యంగా గ్రహించింది. అప్పటి నుంచి పోలీసులతో అడ్డుకొనే ప్రయత్నాలు మానుకొంది.

నారా లోకేష్‌ పాదయాత్ర వలన ఒరిగేది, తరిగేదీ ఏమీ లేదని చెపుతునప్పటికీ దాని ప్రభావం చాలా తీవ్రంగానే ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ ప్రభుత్వం బాగానే గ్రహించింది. కానీ పోలీసులతో అడ్డుకొన్నా ఇబ్బందే… పార్టీ కార్యకర్తలతో అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే ఘర్షణలు చెలరేగితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని మీడియా అభివర్ణిస్తుంది. పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించినప్పుడు ఇలాగే జరిగింది. వైసీపీ నేతల చేతిలోనే పోలీసులు, అధికారం ఉన్నాయి కనుక చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలపై హత్యానేరం క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేయించింది.

కానీ వాటితో టిడిపిని అడ్డుకోలేమని మొన్న గన్నవరం సభతో మరోసారి నిరూపించింది. కనుక నారా లోకేష్‌ పాదయాత్రను అనుమతించలేక, అలాగని అడ్డుకోలేక సతమతమవుతోంది వైసీపీ. అందుకే రాత్రిపూట అయితే స్ట్రీట్ లైట్లు ఆర్పేయడం, ఫ్లెక్సీ బ్యానర్లు చించడం వంటి చవుకబారు ప్రయత్నాలు చేస్తూ సంతోషపడుతోంది. పాపం వైసీపీ!

ADVERTISEMENT
Latest Stories