టిడిపి యువనేత నారా లోకేష్ రాయలసీమ జిల్లాలలో యువగళం పాదయాత్ర ముగించుకొని మంగళవారం సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. సీమ జిల్లాలలో పాదయాత్ర ముగిసినప్పుడు నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
సీమ జిల్లాల ప్రజల ప్రేమాభిమానాలు పొందిన తాను ఎంతో భాగ్యశాలిగా భావిస్తున్నానని, సీమ జిల్లాల ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక నెరవేరుస్తానని నారా లోకేష్ మరోసారి పునరుద్ఘాటించారు. నారా లోకేష్ నేలకు తల ఆనించి రాయలసీమ గడ్డకు, ప్రజలకు నమస్కరించి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
ఆయనకు జిల్లాకు చెందిన టిడిపి నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి వెంట నడిచారు. నారా లోకేష్ ఇప్పటి వరకు యువగళం పాదయాత్రలో125 రోజులలో 1584 కిమీ నడిచారు.
యువగళం పాదయాత్రతో నారా లోకేష్ ఏం సాధించారంటే…
ప్రజల కష్టనష్టాలను, అనుభవిస్తున్న బాధలను కళ్ళారా చూసి చలించిపోతున్న నారా లోకేష్ వారికి ధైర్యం చెపుతూ భవిష్యత్‌పై భరోసా కల్పించగలిగారు.
నారా లోకేష్ అసలు పాదయాత్రే చేయలేడనుకొంటే బండరాళ్ళు సైతం పగిలే మండుటెండల్లో నారా లోకేష్ 125 రోజులలో 1500 కిమీ పాదయాత్ర చేసి చూపారు.
ఒకవేళ పాదయాత్ర చేసినా తాము ఆడిన ‘మూడు రాజధానులు గేమ్’తో సీమ ప్రజలు నారా లోకేష్ పాదయాత్రను పట్టించుకోరనుకొంటే, తొలిరోజు నుంచే జనాలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్రతో ప్రజానీకం టిడిపివైపు మొగ్గుచూపుతుండటం చూసి టిడిపి శ్రేణులలో నూతనోత్సాహం పొంగిపొర్లుతుండగా, వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవన్నీ సరిపోవన్నట్లు నారా లోకేష్ పాదయాత్రలో రాయలసీమలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏవిదంగా ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, చెరువులు అన్నిటినీ దోపిడీ చేస్తున్నారో కళ్ళకు కట్టిన్నట్లు సెల్ఫీలతో యావత్ రాష్ట్ర ప్రజల ముందుంచుతున్నారు.
నాలుగేళ్ళ పాలన పూర్తయినా ఇంతవరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను, అనాలోచిత నిర్ణయాలను ఎండగడుతూ, ఆ కారణంగా సీమ జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నారు.
వైసీపీ నేతలందరూ రాష్ట్రాభివృద్ధి గురించి కాక తమతమ జిల్లాలు, నియోజకవర్గాలలో ఏది దొరికితే అది దోపిడీ చేస్తున్నారని నారా లోకేష్ గట్టిగా వాదిస్తున్నారు.
ప్రశ్నించే గొంతులను వైసీపీ ప్రభుత్వం కర్కశంగా అణచివేస్తున్నప్పటికీ, సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే ‘హూ కిల్డ్ బాబాయ్?’అంటూ నారా లోకేష్ ప్రశ్నించడం సంచలనం సృష్టించింది.
గత ఎన్నికలలో నారా లోకేష్ వ్యక్తిత్వ హననం చేసి రాజకీయాలకు పనికిరాడని ముద్ర వేసిన వైసీపీ నేతలకు తాను వారి కంటే అన్ని విధాలా మేలైన, సమర్ధుడైన నాయకుడినని నారా లోకేష్ నిరూపించుకొన్నారు.
ఆనాడు తనను ఎద్దేవా చేసిన వైసీపీ నేతలలో ఏ ఒక్కరూ కూడా నేడు ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సాహసించడం లేదు. ఎందుకంటే వాటి గురించి వాదించడం మొదలుపెడితే తమ వేళ్ళతో తమ కళ్ళే పొడుచుకొన్నట్లవుతుందని వారికీ తెలుసు.
మొత్తం మీద నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఊహించిన దాని కంటే గొప్పగా సాగుతోంది. విజయవంతమైంది. ప్రజలను మళ్ళీ టిడిపికి దగ్గర చేసేందుకు ఎంతగానో తోడ్పడుతోందని చెప్పవచ్చు.



