భౌతిక దాడులు కామన్… శాంతి భద్రతలు భేష్!

YSRCP_Narasaraopetఒకప్పుడు ఏపీలో కొన్ని జిల్లాలలోనే ఫ్యాక్షనిజం విచ్చలవిడిగా సాగేది. టిడిపి హయాంలో అవి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలయ్యాయి. ఒకప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం, భౌతికదాడులు చాప కింద నీరులా అన్ని జిల్లాలకు వ్యాపిస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది.

విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, వారి కుటుంబ స్నేహితుడులని కొందరు దుండగులు విశాఖలో వారి ఇంట్లోనే నిర్బందించి రెండు రోజులు చిత్రహింసలు పెట్టారంటే ఏపీలో శాంతిభద్రతలు ఏవిదంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. అయినప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భేషుగ్గా ఉందని పోలీస్ శాఖ చెప్పుకొంటుంది.

ADVERTISEMENT

కానీ ఏపీలో అరాచక వ్యవస్థ నెలకొందని దేశంలో పోలీసులందరికీ బిగ్‌బాస్‌ అయిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తేల్చి చెప్పారు. అయినా ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఆయన హెచ్చరికను పట్టించుకోలేదని ఆదివారం రాత్రి పల్నాడు జిల్లాలో జరిగిన దాడులు నిరూస్తున్నాయి.

జిల్లా టిడిపి అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు శనివారం సాయంత్రం నరసారావుపేటలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి ఆ ఆరోపణలను ఖండించవచ్చు లేదా తప్పని నిరూపించమని సవాలు విసరవచ్చు.

కానీ ప్రత్యర్ధిపై దాడి చేసి నోరు మూయించాలనుకొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన అనుచరులు కోటప్పకొండలో చల్లా సుబ్బారావు ఇంటిపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న టిడిపి నేతలు అరవింద బాబు, కడియాల రమేష్ టిడిపి కార్యకర్తలతో అక్కడికి చేరుకొన్నారు.

ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకొన్నాయి. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్న అడ్డుకోలేకపోయారు. అదే సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అక్కడికి రావడంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. టిడిపి నేతలు జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు.

ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం గూండాయిజాన్ని చట్టబద్దం చేసింది. అందుకే వైసీపీ నేతలు గూండాల్లా రెచ్చిపోయి టిడిపి నేతల ఇళ్ళపై దాడులు చేయిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి సహకరిస్తున్న పోలీస్ అధికారులందరిపై మేము అధికారంలోకి వచ్చాక కటిన చర్యలు తీసుకొంటాము.

ఇప్పుడు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలందరికీ కూడా మళ్ళీ జీవితంలో ఎన్నడూ దౌర్జన్యాల గురించి కలలో కూడా ఆలోచన కలగకుండా ఉండేలా తగిన ట్రీట్మెంట్ ఇస్తాము,” అని హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories