అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేయకపోతే ఇంకా పన్నులు విదిస్తానంటూ బెదిరించారు. భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడం ద్వారా ట్రంప్ అనంత పనీ చేసే రకమే అని నిరూపించుకున్నారు.
కనుక ట్రంప్ బెదిరింపులను భారత్ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికాతో లక్ష కోట్లు విలువగల ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకోబోతున్నామని చెప్పి ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ పెద్ద షాక్ ఇచ్చింది.
ట్రంప్ మళ్ళీ బెదిరించగానే భారత్ కూడా ఊహించని విదంగా పావులు కదపడం మొదలు పెట్టింది. భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు.
ఇది చాలా కాలం క్రితమే ఖరారు అయిన షెడ్యూల్ అని చెప్పినప్పటికీ, ఇది ట్రంప్‌కు భారత్ షాక్ ఇవ్వడంగానే చూడవచ్చు. లేకుంటే అజిత్ దోభల్ పర్యటనని రద్దు లేదా వాయిదా వేసేది కదా?
ఇటువంటి సమయంలో అజిత్ దోభల్ రష్యా పర్యటనే ట్రంప్‌కు పెద్ద షాక్ అనుకుంటే, ప్రధాని మోడీ చైనా పర్యటన కూడా ఖరారు చేసి మరో షాక్ ఇచ్చారు. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1వ తేదీలలో చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు.
డోనాల్డ్ ట్రంప్ భారత్, రష్యా, చైనాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. కానీ రష్యా, చైనా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు భారత్ కూడా తగ్గేదేలే అంటోంది. కనుక అమెరికాతో జరుగుతున్న ఈ ‘ట్రేడ్ వార్’లో ఈ మూడు బలమైన దేశాలు చేతులు కలిపితే నష్టపోయేది అమెరికాయే. ఈవిదంగా ప్రధాని మోడీ ట్రంప్‌పై ఒత్తిడి పెంచి దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.






