దేశ ప్రజలతో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్ కు కూడా షాక్ ఇచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అసలు ఎవరికి తెలుసు? ఏపీ ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు చంద్రబాబుకు ముందుగానే సమాచారం అందిందా? అంటే అంతకు మించిన అవివేకమైన ఆరోపణ మరొకటి ఉండదన్న సమాచారం అందుతోంది. ఒక్క చంద్రబాబుకే కాదు, మోడీకి అత్యంత విశ్వాసపరుడిగా ఉన్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు కూడా ఈ విషయం గురించి తెలియకపోవడం అనేది… ఎంత గోప్యంగా ఈ కార్యాన్ని చక్కబెట్టారో అర్ధం చేసుకోవచ్చు. అయితే మరి ఎవరెవరితో సంప్రదింపులు జరిపి మోడీ ఈ విషయాన్ని అమలు చేసారు? అంటే…
ఆరు నెలల క్రితం అత్యంత రహస్యంగా ప్రారంభమైన ఈ ప్రక్రియలో … అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తో మోడీ సమావేశమై పెద్ద నోట్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుని, ఆ స్థానంలో 100, 50 రూపాయల నోట్లను ఎక్కువగా ముద్రించాలని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘట్టం వరకు ప్రధాని మోడీ, రఘురాం రాజన్ మరియు ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాలకు మాత్రమే తెలియగా, ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్ కు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే నెక్స్ట్ స్టెప్ వేయాలంటే… ఖచ్చితంగా ఆర్ధిక అధికారుల సహకారం కావాల్సి వచ్చింది.
దీంతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి మొత్తం వివరించి, అత్యంత విశ్వసనీయంగా ఉండే ఓ ఇద్దరి సీనియర్ అధికారులను ఎంపిక చేసారు. మొత్తమ్మీద ఆ నలుగురు, ఈ ముగ్గురు… మొత్తంగా ఏడుగురికి తప్ప మరెవరికీ విషయం బయటకు పొక్కనివ్వలేదు. దాదాపు మూడు నెలల క్రితం కొత్తగా 2 వేల రూపాయల నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ డిజైన్లకు సంబంధించి పలుమార్లు ఆర్బీఐ అధికారులు ప్రధానిని కలిసి సంప్రదింపులు జరిపారు. డిజైన్ ను ప్రధాని ఖరారు చేయగానే ఇప్పటివరకు దాదాపు 350 కోట్ల రూపాయలు విలువైన 2 వేల రూపాయలను ముద్రించినట్లు సమాచారం.
అప్పటివరకు కొత్తగా 2000 రూపాయల నోటు బయటకు వస్తుందని అనుకున్నారు గానీ, ఈ 500, 1000 నోట్లు రద్దు అవుతున్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఇక, గత గురువారం నాడు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్బీఐ అధికారులతో సమావేశం అయ్యి, పెద్ద నోట్ల రద్దు విషయమై అభిప్రాయం కోరగా, కొందరు సమర్ధించారు, మరికొందరు విభేదించారు. ఏది ఏమైనా సమావేశాన్ని మాత్రం అత్యంత గోప్యంగా ఉంచాలని కోరారు. అలాగే శుక్రవారం నాడు ఆర్ధిక శాఖ అధికారులతో మోడీ, అరుణ్ జైట్లీ సమావేశమై చర్చించారు. ఇక, చివరగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు ఆర్బీఐ బోర్డు భేటీ అయ్యి, 500, 1000 నోట్లను రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఆ పిదప ఆరున్నర్రకు కేంద్ర క్యాబినెట్ సమావేశమై, పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సహచర మంత్రులకు సమావేశం అందించారు. దానికి అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ లోపున ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు కూడా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు గవర్నర్ సమాచారం ఇచ్చారు. ఈ ‘ఆపరేషన్’లో ఎక్కడా ఎలాంటి సమాచారం మీడియాకు లీక్ కాకుండా జాగ్రత్త పడడం వలనే సక్సెస్ అయ్యింది. లేదంటే ఫలితం మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు. ఈ ‘ఆపరేషన్’ ఇంత సక్సెస్ ఫుల్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం.



