పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు అంటూ హడలగొట్టేసిన మోడీ ప్రభుత్వం, సమావేశాలు మొదలవగానే హటాత్తుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదనను తెరపైకి తేవడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలలో కలకలం మొదలైంది.
ఆ బిల్లుని అన్ని పార్టీలు సమర్ధిస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు హటాత్తుగా అమలుచేస్తే అన్ని పార్టీలలో అనేక మందికి సీనియర్లను, సిట్టింగ్‌లను పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకే అన్నీ పార్టీలు ఆందోళన చెందాయి.
కానీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాతే అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది. దీంతో అన్నీ పార్టీలకు, ముఖ్యంగా ఎన్నికలకు సిద్దమవుతున్న రాష్ట్రాలలో పార్టీలకు, మరీ ముఖ్యంగా తెలంగాణలో బిఆర్ఎస్ అభ్యర్ధులకు చాలా ఊరట లభించింది.
ఈరోజు మధ్యాహ్నం లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ రాజ్యాంగ (128వ) సవరణ బిల్లు-2023 (మహిళా రిజర్వేషన్ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.