ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్ధిగా సీపీ రాధా కృష్ణన్‌ని ఎంపిక చేయగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్ధిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని బరిలో దింపింది. కనుక ఈ పదవికి ఎన్నికలు తప్పనిసరి. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగబోతోంది.
చంద్రాపురం పొన్నుస్వామి రాదా కృష్ణన్ (సీపీ రాధాకృష్ణన్) చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్ఎస్‌లో ఉన్నారు. తర్వాత బీజేపిలో చేరి 1998, 1999లో రెండుసార్లు కోయంబత్తూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపికి అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. కనుక బీజేపితో చాలా బలమైన అనుబందం ఉంది. రాధాకృష్ణన్ మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. చాలా మంది రాజకీయనాయకుల్లాగే ఆయనకు సొంత వ్యాపారాలున్నాయి.
జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంకు చెందిన వ్యక్తి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. 2007 జనవరి నుంచి నాలుగేళ్ళపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
ఉపరాష్ట్రపతిని లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. కనుక పార్లమెంటులో ఎక్కువ మంది ఎంపీలున్న కూటమి అభ్యర్ధి విజయం సాధించే అవకాశం ఉంటుంది.
లోక్ సభలో ఎన్డీయేకి మొత్తం 293 మంది, ఇండియా కూటమికి 232 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఎన్డీయేకి మొత్తం 133 మంది, ఇండియా కూటమికి 77 మంది ఎంపీలు ఉన్నారు.
అంటే పార్లమెంట్ ఉభయ సభలలో కలిపి ఎన్డీయేకి 426 సభ్యులు, ఇండియా కూటమికి 309 మంది సభ్యులు ఉన్నారన్న మాట!
కనుక ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనప్రాయమే అని భావించవచ్చు.






