ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యుల జీవనశైలి వారి స్థాయికి తగ్గట్టుగానే ఉంటుందన్న విషయం బహిరంగమే. 12000 కోట్లతో కళ్లు చెదిరే ఇల్లు కట్టినా… 25 కోట్లతో కారు కొనుగోలు చేసినా…. అది వారికే సాధ్యం. దాదాపు 160 లగ్జరీ కార్లు ఆయన నివాసంలో ఎప్పుడూ కొలువు తీరి ఉంటాయి. వీటికి తోడు సొంత విమానాలు… షిప్ లు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. ఈ జాబితాలో తాజాగా ఓ మొబైల్ ఫోన్ కూడా వచ్చి చేరింది.
ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సెల్ ఫోన్ ధర ఎంతో తెలిస్తే… ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ మొబైల్ ధర సింపుల్ గా 48.5 మిలియన్ డాలర్లు… అంటే మన కరెన్సీలో అక్షరాలా 300 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘ఫాల్కన్ సూపర్ నోవా ఐ ఫోన్ 6 పింక్ డైమండ్ ఫోన్’ను నీతా ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్లను కేవలం ఆర్డర్ పైనే తయారు చేస్తారు. మొత్తం బంగారాన్ని వినియోగించే ఈ ఫోన్ వెనుక వైపు గులాబీ రంగులో ఉన్న వజ్రాన్ని కూడా అమర్చారు.



