అసలైన సమ్మర్ వేడి మొదలైంది, నిజానికి జనాలు సినిమా కోసం కాకపోయినా, ఏసీల కోసమైనా థియేటర్లకి వచ్చేవారు. కానీ.. ఈ ఏడాది అది సాధ్యపడే అవకాశం కనిపించడం లేదు. థియేటర్లలో విడుదలవుతున్న ఏ ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను థియేటర్లకి తీసుకొచ్చేలా కనిపించడం లేదు.
గతవారం విడుదలైన “జెట్ లీ, గాయపడ్డ సింహం”, రేపు విడుదలవుతున్న “గోదారి గట్టుపైన, రేజర్, సతీలీలావతి”, వచ్చేవారం రిలీజ్ కి రెడీగా ఉన్న సూర్య డబ్బింగ్ చిత్రం “వీరభద్రుడు”, మే ఆఖరివారంలో వచ్చే మలయాళ డబ్బింగ్ చిత్రం “దృశ్యం 3” కూడా ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేయలేకపోతున్నాయి.
పైన పేర్కొన్న సినిమాలకి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ వస్తే కానీ జనాలు థియేటర్లకి వచ్చే ఛాన్స్ లేదు. అది ఎంతవరకు సాధ్యం అనేది పూర్తిగా కంటెంట్ మీద డిపెండ్ అయిన విషయం.
అందువల్ల లిటరల్ గా జూన్ 4న “పెద్ది” వరకు ప్రేక్షకుల్ని థియేటర్లకి చేర్చే సినిమా లేనట్లే.
ఇలా.. థియేటర్లకి జనాల్ని వచ్చేలా సినిమాలు లేకపోవడంతో రీరిలీజులతోనే కాలం నెట్టేస్తున్నారు ఎగ్జిబిటర్లు.
ఇలా అయితే.. థియేటర్లు, మరీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు ఎలా సర్వైవ్ అవుతాయి అనేది పెద్ద ప్రశ్న. మల్టీప్లెక్స్ అంటే ఏదో ఒక భాషా చిత్రాన్ని ప్రదర్శించి సొమ్ము చేసుకుంటుంది, సింగిల్ స్క్రీన్లు డిపెండ్ అయ్యేది తెలుగు సినిమాల మీదే. అది కూడా సమ్మర్ హాలీడేస్ కారణంగా పిల్లల్ని తీసుకొని థియేటర్లకి వెళ్దాం అని పెద్దలు అనుకునే టైంలో, సరైన సినిమా లేకపోవడం అనేది ఎగ్జిబిటర్లకి పెద్ద తలనొప్పిగా మారింది.




