జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఈరోజు నుండి జిల్లాల వారీగా పార్టీ నాయకులు, అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుంచి ప్రారంభించామని ప్రకటించిన జనసేనాధిపతి ప్రస్తుతం రోజుకు రెండు జిల్లాలకు సంబంధించి సమీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం సమీక్షతో ఈ కసరత్తు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తిచేయాలని భావిస్తున్నారు.
జనసేన మేనిఫెస్టోను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకువెళ్లారు?, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జనసేన అభిమానులకు, పార్టీ నాయకులకు మధ్య సమన్వయం ఎలా ఉంది? అనేది భేరీజు వేసుకుంటున్నారు. అదే సమయంలో జిల్లాల వారీగా పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎన్నికల నేపథ్యంలో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి? అనే దాని పై కూడా స్థానికి నేతలతో సమీక్ష జరుపుతున్నారు. పార్టీ సీనియర్ నేతలందరూ ఈ సమీక్షలకు హాజరు అవుతున్నారు.
ఇప్పటివరకు ఆరు జిల్లాల పర్యటన దాదాపు పూర్తి చేసిన పవన్‌కల్యాణ్.. సమీక్షలు పూర్తయ్యాక మిగిలిన ఏడు జిల్లాల్లోనూ వేగంగా పర్యటన పూర్తి చేయాలని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక ప్రణాళిక లేకుండా ముందుకు సాగుతున్న పార్టీ వ్యవహారాలకు ఈ సమీక్షలు ఎంత గానో ఉపయోగపడతాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సమీక్షలతో పార్టీ రాష్ట్ర నాయకులు ఎక్కువ, స్థానిక నాయకులు తక్కువగా ఉంటున్నారట.
పైగా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పడం ఎక్కువ వారి నుండి అభిప్రాయాలను సేకరించడం తక్కువగా ఉంటుందని శ్రీకాకుళం సమీక్ష తరువాత తేలిందని పార్టీ వర్గాల సమాచారం. పవన్ కల్యాణే సర్వస్వము అని సాగుతున్న పార్టీ గ్రామా స్థాయి నుండీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితేనే పార్టీ మనుగడ సాగించగలదు. దీనికి ఈ సమీక్షలను బాగా వాడుకుంటే ఆ పార్టీకే మంచిది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పే ఇది మళ్ళీ జనసేనలో పునరావృతం అయితే అప్పటి తప్పిదం నుండి ఏం నేర్చుకున్నట్టు?



