జగన్‌ పోరాట పఠిమని తక్కువ అంచనా వేస్తే….

jagan-chandrababu-naidu

ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి ఓడిపోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఓ సీనియర్ టిడిపి నాయకుడుతో ఆ పార్టీ శ్రేయోభిలాషి ఓ మాటన్నారు.

“వైసీపి ఓడిపోయింది కానీ చచ్చిపోలేదు. వైసీపిని రాజకీయంగా చంపినప్పుడే టిడిపి నిజమైన విజయం సాధించిన్నట్లు లెక్క,” అని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

ADVERTISEMENT

వేసవి ఎండలకు పచ్చగడ్డి పూర్తిగా ఎండి కనబడకుండా పోతుంది. కానీ నాలుగు చినుకులు పడేసరికి మళ్ళీ ఎక్కడికక్కడ పచ్చగా మొలుస్తుంటుంది. వైసీపి కూడా అలాగే ఓటమి తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది.

ఓటమి తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారం, చెల్లితో ఆస్తుల పంచాయితీ, వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టులు… ఇలా వరుసగా ఎన్ని ఒత్తిళ్ళు ఎదురవుతున్నా కేవలం 5 నెలల్లోనే, జగన్‌ నాయకత్వంలో వైసీపి సిఎం చంద్రబాబు నాయుడునే బలంగా ఢీకొనే స్థాయికి చేరుకుంది.

అదీ… జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి నేతలు ఎవరూ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, ప్రజల మద్యకు వెళ్ళకుండానే టిడిపికి ఇంతగా ఎదురొడ్డి పోరాడుతున్నారని గుర్తించాలి. అదే… జగన్‌ పాదయాత్రతో ప్రజల మద్యకు బయలుదేరితే వైసీపి మరింత బలపడటం ఖాయం!

వైసీపి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత టిడిపి ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతో జగన్‌ దేశం విడిచి, ఆ పార్టీ నేతలు రాష్ట్రం విడిచి పారిపోతారని ఆ మద్య ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎవరూ ఎక్కడికీ పారిపోలేదు. పైగా అందరూ కలిసికట్టుగా సిఎం చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి చేస్తున్నారు కూడా.

జగన్‌ శాసనసభకు రాకపోవడం ఖచ్చితంగా పిరికితనమే కావచ్చు. కానీ ఓటమి తర్వాత వైసీపి నేతల్లో ఏర్పడిన భయాందోళనలను పూర్తిగా తొలగించి వారిని ధైర్యంగా ఈ స్థాయిలో పోరాడేలా చేయగలిగారనే వాస్తవాన్ని టిడిపి విస్మరించరాదు.

ముఖ్యంగా జగన్‌ నుంచి టిడిపి నేర్చుకోవలసిన విషయం మరొకటుంది. జగన్‌ ముఖ్యమంత్రికాగానే సంక్షేమ పధకాలు, వాలంటీర్లు, సచివాలయాలు, సోషల్ మీడియా, ఐప్యాక్, వైసీపి రంగులు, స్టిక్కర్స్, టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులు, భౌతిక దాడులు, మూడు రాజధానులు, విశాఖ రాజధాని వంటివన్నీ అమలుచేశారు. ఆ వ్యూహాలన్నీ విఫలమై ఉండొచ్చు.

కానీ వాటితో తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. 2024లో జరుగబోయే ఎన్నికలకు 5 ఏళ్ళ ముందే జగన్‌ ఇన్ని ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగారనే విషయం టిడిపి, జనసేనలు గ్రహించాలి. అంటే ఆ దారుణాలన్నీ చేయమని కాదు. స్వోత్కర్ష, పరనిందతో కాలక్షేపం చేయకుండా, 2029 ఎన్నికలలో మన పరిస్థితి ఏవిదంగా ఉండబోతోందనే ఆలోచనతో, రాజకీయ స్పృహతో అప్రమత్తంగా ముందుకు సాగడం చాలా అవసరమని గ్రహించాలి.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం కదా… సోషల్ మీడియా కేసులున్నాయి కదా?అని టిడిపి ధీమాగా ఉంటే చరిత్ర పునరావృతం కావచ్చు!

ADVERTISEMENT
Latest Stories