ఈశాన్య భారతదేశంలో బీజేపీ మరో అపూర్వ విజయం సొంతం చేసుకుంది. త్రిపురలో సొంతంగా, నాగాలాండ్ లో మిత్రులతో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ మేఘాలయాలో అతిపెద్ద పార్టీగా అవతరించినా, బీజేపీ భేరసారాలకు దిగితే అది కూడా పదిలం కాదు. ఈ విజయం వచ్చే 2019 ఎన్నికలలో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
2014 ఎన్నికలలో ఆ రాష్ట్రాలలో బీజేపీ దాదాపుగా సున్నా. ఇప్పుడు అధికారంలోకి రావడమంటే మాటలు కాదు. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ అని ఈ విజయం సూచిస్తుంది. ఈ విజయం రెండు తెలుగు రాష్ట్రాల మీద ఏ మేరకు ప్రభావం చూపగల్గుతుంది అనేది అసలు ప్రశ్న.
ఈ విజయంతో బీజేపీకి తెలంగాణపై ఆశలు చిగురిస్తాయి. ఎంతోకొంత బలంగా ఉన్న తెలంగాణపై కమలనాధులు తమ సర్వశక్తులు వడ్డుతారు. దీనితో కేసీఆర్ ఎంతోకొంత కలవరపాటు పడటం అయితే ఖాయం. అయితే తెరాసను దెబ్బ తీయగలిగే సీన్ బీజేపీకి ఉందా అంటే ప్రశ్నర్ధకమే. కేంద్ర నిధుల కోసం బీజేపీతో సఖ్యతగా ఉండాలా లేక తనదైన శైలిలో విరుచుకుపడాలా అని కేసీఆర్ ఆలోచన చేస్తారు.
మరోవైపు చంద్రబాబుది అదే పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అన్ని వైపుల నుండి ఒత్తిడి ఉంది చంద్రబాబు పైన ఎన్డీయే నుండి వైదొలగాలని. అయితే 2019లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీతో తెగతెంపులు అంత తేలిక కాదు. పై పెచ్చు ఎన్నికల వరకు బీజేపీ వేధింపులు కూడా ఉంటాయి. కాబట్టి ఇది సంకట స్థితి అనే అనుకోవాలి.



