“రాసి పెట్టుకోండి, 2024లో ఇదే జరగబోతోంది” అంటూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని భారీ ప్రకటనలే ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే… ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీని తనకు అవకాశం, సమయం వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ కైవసం చేసుకుని కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీతో కలిసి 2024లో పోటీ చేస్తారట.
ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మరో కొత్త పార్టీని స్థాపించబోతున్నారట. ఈ కొత్త పార్టీని జనసేనతో కూటమిగా ఏర్పాటు అయ్యి, 2024 ఎన్నికలలో పోటీ చేస్తారట. వీళ్లిద్దరికీ డిపాజిట్స్ కూడా దక్కవట. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ సింగిల్ గా పోటీ చేసి ఎన్టీఆర్ తో కూడిన టీడీపీ మరియు బీజేపీ కూటమిలను మట్టి కరిపిస్తారట.
మాజీ మంత్రి కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత రాజకీయ విజ్ఞత కలిగిన వారికి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక్కటి మాత్రం వైసీపీకి కాస్త మింగుడు పడని అంశంగా మారిందని చెప్పొచ్చు. ఇటీవల కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ జగన్ అండ్ కో కు రుచించడం లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.
“రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా సాధ్యం” అన్న నానుడిని వినియోగించి బహుశా కొడాలి నాని తన అంచనాలను మీడియా ముఖంగా ఏపీ ప్రజలకు విన్నవించుకున్నారేమో గానీ, మరీ ఇలాంటి వాదనను వినిపిస్తే ప్రజలు ఏమనుకుంటారో అన్న భావన కూడా లేకుండా చాలా బలంగా తన వాణిని వినిపించారు.



