అమెరికాలో న్యూజెర్సీ నగరంలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా (ఆటా) అధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా సభ్యులు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రసంగం ఆయన తెలుగు భాషాభిమానానికి, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఆయనకున్న గౌరవానికి అద్దం పడుతోంది. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో తెలుగు మాద్యమం గురించి ఆయన చెప్పిన విషయాలు ఇంగ్లీషు మీడియం కోసం అర్రులు చాస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేదిగా ఉంది.
“మాతృభూమిని, బంధుమిత్రులకి అందరికీ దూరంగా ఇక్కడ అమెరికాలో ఉంటున్న తెలుగువారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ నిబ్బరంగా ముందుకు సాగుతున్నారు. ఇంత దూరంలో ఉన్నా మన తెలుగు భాషను, మన సంస్కృతీ సాంప్రదాయాలను మరిచిపోకుండా పాటిస్తున్నారు. మన భాష, మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల మీ నిబద్దత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్ మీ అందరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందని నమ్మకం కలుగుతోంది.”
“నేను చిన్నప్పటి నుంచి మాతృభాష తెలుగులోనే చదువుకొని ఈ స్థాయికి ఎదిగాను. న్యాయశాస్త్రం అభ్యసించేటప్పుడు మాత్రం తెలుగులో చదువుకొనే వెసులుబాటు లేదు కనుక ఇంగ్లీషులో చదువుకొన్నాను. కనుక మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావని, జీవితంలో రాణించలేమనేది కేవలం అపోహ మాత్రమే. నేను మన మాతృభాషలోనే చదువుకొని ఈ స్థాయికి ఎదగడమే ఇందుకు నిదర్శనం.
అయితే నేడు తెలుగుభాషను కాపాడుకోవడం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరం. తెలుగు అనేది కేవలం ఓ భాష మాత్రమే కాదు అదొక జీవన విధానం. మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం చాలా గొప్ప విషయం. అమ్మభాషలో తీయదనాన్ని అనుభవించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. కనుక తెలుగువారు అందరూ విధిగా తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించి, వారితో తెలుగులో మాట్లాడాలని కోరుతున్నాను. తద్వారా పిల్లలకు బాల్యం నుంచే తెలుగు భాషపై పట్టు వస్తుంది. అది మన భాష అనే మమకారం ఏర్పడుతుంది.
మనకు శ్రీశ్రీ, గుర్రం ఝాషువా, దాశరధి వంటి ఎందరో మహనీయులు తరతరాలకు తరగని వెలకట్టలేని భాష సంపదను ఇచ్చారు. కళామతల్లి ముద్దుబిడ్డడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్, ఘంటశాల వంటి మహనీయుల వలననే మా తరానికి తెలుగు భాషపై ఇంత పట్టు చక్కటి ఉచ్ఛారణ వచ్చింది. ఈ సందర్భంగా ఆ మహనీయులు అందరికీ నివాళులు ఆర్పిస్తున్నాను,” అని అన్నారు.
ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే పిల్లలకు భవిష్యత్ ఉండదు… తెలుగు మీడియంలో చదివితే వారి జీవితాలు నాశనం అయిపోయినట్లే… మద్యతరగతి, ఆ పైవర్గాలవారు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారు కనుక వారు మాత్రమే జీవితంలో రాణిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొనే విద్యార్దులు జీవితంలో వెనకబడిపోతారు… వంటి వితండవాదంతో బలవంతంగా పిల్లలపై ఇంగ్లీషు మీడియం రుద్దుతున్న జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ఈ ప్రసంగం కనువిప్పు కలిగిస్తుందా?అంటే కాదనే చెప్పవచ్చు.
తెలుగు భాషకు పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు ప్రాధాన్యత, గౌరవం ఇచ్చి కాపాడుకోవలసిన పాలకులే దాని ఉనికి కోల్పోయే స్థితికి తీసుకువెళుతుండటం చాలా బాధాకరం.



