జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ మీద విరుచుకుపడ్డారు. లోకేష్ అవినీతి చంద్రబాబు గారికి తెలీదా లేక తెలిసే జరుగుతుందా అని విమర్శలు సంధించారు. తమిళనాడు లో అరెస్టు ఐన శేఖర రెడ్డికి లోకేష్ కి సంబంధాలు ఉండటం వల్లే ప్రధాని చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అనుకుంటున్నారు, నాకైతే తెలీదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ గానీ ఆ పార్టీ నాయకులు గానీ ఇప్పటిదాకా లోకేష్ పై ఆరోపణలు ఏంటో వాటికి సాక్ష్యాలు ఏంటో చెప్పడం లేదు. ఒక టివి ఛానల్ తో ఆ పార్టీ నియమిత ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ ఇదే ప్రశ్నకు ఎలాంటి స్పష్టమైన సమాధానం చెప్పలేదు. లోకేష్ పై ఏవైనా ఆధారాలు ఉన్నాయా అంటే లోకేష్ ఎలాంటి అవినీతి చేస్తున్నారో అందరికి తెలిసిందేగా అన్నారు.
ప్రభుత్వాన్ని ఆయననే నడిపిస్తున్నారు అంటూ రొటీన్ ఆరోపణ చేసి వదిలేశారు. ఇప్పటికే శేఖర్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ చెప్పారని మరిన్ని వివరాలు ఆయనే చెబుతారని శ్రీధర్ చెప్పుకొచ్చారు. జనసేన కూడా వైకాపా లానే గంపగుత్తుగా ఆరోపణలు చేస్తుందా? బురద జల్లుతాం మీరే కడుక్కోవాలి అన్నట్టు ఉందా ఆ పార్టీ వైఖరి.



