ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏదంటే, జగన్-షర్మిల ఆస్తి పంపకాల కీచులాటలు. అయితే రాష్ట్రంలో ఇంతకంటే ముఖ్యమైన విషయాలు, సమస్యలు లేవా? అంటే ఉన్నాయి.
విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార వ్యాధితో ప్రజలు చనిపోతున్నారు. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. పలువురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పటికే జగన్ వెళ్ళి వారిని పరామర్శించి సిఎం చంద్రబాబు నాయుడుని తిట్టిపోసి వెళ్ళారు. కానీ అది ఈ సమస్యకు పరిష్కారం కాబోదు.
ఆ బాధ్యత ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆయన గుర్ల వెళ్ళి ముందుగా బాధితులను, కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు చొప్పున ఆర్ధికసాయం అందజేశారు.
అనంతరం గుర్ల మండలానికి మంచి నీళ్ళు అందించే నెల్లిమర్ల వద్ద చంపానది ఒడ్డున గల రక్షిత మంచినీటి పధకం (పంప్ హౌస్, నీరు శుద్ధిచేసి పంపిణీ చేసే వ్యవస్థ)ని పరిశీలించి అధికారులను ఈ సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.
సాధారణంగా రక్షిత మంచినీటి పధకంలో ‘వాటర్ ఫిల్టర్ బెడ్’ని నిర్ధిష్ట కాలం తర్వాత మార్చుతుండాలి. అప్పుడే స్వచ్చమైన నీరు పంపిణీ అవుతుంది. కానీ గత 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా మార్చకపోవడం వలన నీటి వడపోత సరిగ్గా జరుగడం లేదని, ఆ నీటిని తాగడం వలననే ప్రజలు అతిసార వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుసుకొని పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించి ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అవసరమైన నిధులు విడుదల చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్‌లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా కోసం రూ.650 కోట్లు ఇవ్వబోతోందని, కనుక తక్షణం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు.
గుర్ల మండలంలో ఈ సమస్య బయటపడింది కనుక అందరికీ తెలిసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇటువంటి సమస్యలున్నాయి. కనుక ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ పధకంతో ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.




