సంధ్యా థియేటర్ ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఈ వివాదం పై ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ తప్పెవరిది.? తొందర పడింది ఎవరు.? వెనకడుగు వేయాల్సిందెవరు.? పరామర్శ కు అర్హత ఎవరికీ.? సానుభూతి దక్కింది ఎవరికి.? అనే అంశాల చుట్టే చర్చ నడుస్తుంది.
అయితే ఈ వివాదం పై ఇప్పటి వరకు తన స్పందన తెలియచేయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి గాను ముఖ్య అతిధిగా ఆహ్వానించడానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు ఈ విషయమై పవన్ తో చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న పవన్ సంధ్యా థియేటర్ ఘటనలో మానవత్వం లోపించిందని, గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారంటూ బన్నీ మీద కూడా అసంసృతి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే ఈ వివాదంలో బన్నీ ని ఒంటిని చేసి భాద్యుడిగా చూపించడం కూడా సహేతుకం కాదంటూ వారించారు పవన్.
కత్తికి రెండు వైపులా పదునుంది అనేలా ఈ విషాదంలో అటు ప్రభుత్వం ఇటు అల్లు ఈ ఇద్దరి వాదనలోని బలం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఘటన జరిగిన మరుసటి రోజే హీరో కానీ, చిత్ర యూనిట్ కానీ బాధితులకు అండగా నిలబడి వారిని పరామర్శించి ఉంటే ఈ వివాదం ఇంత వరకు వచ్చి ఉండేది కాదని, రేవంత్ కూడా చాల కష్టపడి పైకొచ్చిన గొప్ప నాయకుడని, తానూ కూడా ముఖ్యమంత్రిగా చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తున్నారంటూ కొనియాడారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ను ఒక్కసారి గమనిస్తే పవన్ కు అల్లు అర్జున్ కు మధ్య ఎక్కడో గ్యాప్ ఏర్పడినట్లు స్పష్టమవుతుంది. అయితే అది ఏపీ నంద్యాల విషయంలో కూటమి vs వైసీపీ మధ్య అంటుకున్న కార్చిచ్చు కావచ్చు. వైసీపీ ఓటమే ప్రధమ కర్తవ్యం అన్నట్టుగా ఉన్న అటువంటి కీలక సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా వెళ్లడం పట్ల పవన్ తీవ్ర సంతృప్తి లోనైనట్లు తెలుస్తుంది.
ఈ కారణంగానే పవన్ హైద్రాబాద్ వెళ్లి కూడా అల్లు కుటుంబాన్ని పరామర్శించడానికి వెనుతిరిగారు అన్న టాక్ నడుస్తుంది. అయితే బన్నీఅరెస్టు నేపథ్యంలో కూడా కుటుంబ పెద్దగా చిరు, నాగబాబు మాత్రమే అల్లు వారి ఇంటికి వెళ్లి తమ మద్దతు తెలియచేసారు. ఇక ఆ పిదప అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహ రెడ్డితో కలిసి చిరు, నాగబాబుల ఇంటికి వెళ్లినప్పటికీ అక్కడ యువ మెగా హీరోలెవరు బన్నీతో కలిసిన దాఖలాలు బయటకు రాలేదు.
అలాగే బన్నీకి తమ మద్దతు తెలుపు చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో చిన్న,పెద్ద ఆర్టిస్టులు, దర్శక నిర్మాతలు అల్లు ఇంటికి వెళ్లినప్పటికీ మెగా హీరోలైన చెర్రీ కానీ, వరుణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కానీ ఎవరు బన్నీకి మద్దతుగా కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక్క ప్రకటన చెయ్యలేదు.
దీనితో మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న వివాదానికి కాస్త బలం చేకూరినట్టయింది. ఇప్పుడు పవన్ కూడా ఈ వివాదం లో బన్నీ వైపే వేలెత్తి చూపడంతో అప్పుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం వెళ్లి తొందరపడ్డ అర్జున్ ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడంలో వెనుకబడి విమర్శలు ఎదుర్కొంటున్నారా అనిపించకమానదు. పవన్ వ్యాఖ్యలతో మళ్ళీ ఫాన్స్ vs ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుందా చూడాలి.




