జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో అల్లూరి సీతారామారాజు విగ్రహానికి నివాళులు అర్పించిన తరువాత జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.
అనంతరం ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “మూడేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలు పడి, వాటిపై ప్రయాణించడానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘గుడ్ మార్నింగ్ సిఎం సర్’ అంటూ ముఖ్యమంత్రిని నిద్రలేపి ఆయన దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాము.
వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధిస్తానని మహిళలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్ముతూ మహిళల పసుపుకుంకుమలను చెరిపేస్తోంది. అప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు మద్య నియంత్రణ అంటున్నారు. మళ్ళీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద ఇసుక మాఫియా నడుస్తోంది. వైసీపీ నేతలు ఇసుక బకాసురులులా తయారయ్యారు. ఇసుక వ్యాపారాలు చేస్తూ అడ్డుగోలుగా ప్రజలను దోచుకొంటున్నారు. వారి వలన సామాన్య ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భావనా నిర్మాణ కార్మికులు అందరూ సతమతమవుతున్నారు.
జగన్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ వద్ద ఎడాపెడా అప్పులు చేస్తూ వాటి కోసం రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించేస్తోంది. నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ళు, ఉపాధ్యాయులను తగ్గించేసి వాటిలో కూడా బైజూస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టింది.
రాష్ట్రంలో వేలాదిమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోవడం లేదు. ఈ మూడేళ్ళలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా మూతపడుతుండటంతో నిరుద్యోగం పెరిగిపోతోంది. చివరికి సినిమాల ప్రదర్శన కూడా ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని సినీ పరిశ్రమను దెబ్బతీస్తోంది. మూడేళ్ళలోనే రాష్ట్రంలో ప్రతీ వ్యవస్థను నాశనం చేసేస్తుంటే ‘ఇలా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తే అక్రమకేసులు బనాయించి వేదిస్తున్నారు.
కానీ మాపై ఎన్ని కేసులుపెట్టినా, జైలుకి పంపినా తగ్గేదేలే… ప్రజా సమస్యలు పరిష్కరించేవరకు మీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము,” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.



