వైసీపీ ప్రభుత్వం తానూ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించుకోవడంలో భాగంగా విశాఖ ఋషికొండ మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోసం దాదాపు 700 కోట్ల వ్యయంతో అతి పెద్ద విలాసవంతమైన ప్యాలస్ ను నిర్మించింది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది.
అయితే గత ఐదేళ్లు ప్రజా సమస్యలను గాలికొదిలి ప్రభుత్వ భవనాల పేరుతో ప్యాలస్ లు నిర్మించుకున్న జగన్ ఇప్పుడు మాత్రం ప్రజల మీద కపటి ప్రేమ కురిపిస్తూ కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారా అంటూ టీడీపీ, జనసేన శ్రేణులు వాపోతున్నారు.
విజయనగరం జిల్లా అతిసారం బారిన పడిన గొర్ల గ్రామం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం నేటి ఈ బాధాకర సంఘటనలకు కారణం అంటూ వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఋషి కొండా ప్యాలస్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వం ప్యాలస్ ల నిర్మాణం మీద పెట్టిన శ్రద్ద ప్రజల ఆరోగ్యాల మీద పెట్టలేకపోయిందని, దాని ఫలితమే నేడు ఈ అనారోగ్యాలకు దారితీస్తున్నాయంటూ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 700 కోట్లు పెట్టి ప్యాలస్ లు నిర్మించే బదులుగా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టవచ్చు కదా అంటూ జగన్ పని తీరును తప్పుబట్టారు.
గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం మంచి నీరు అందించే వాటర్ గ్రిడ్లను శుభ్రం చేయకపోవడం వల్లనే తాగే నీరు కలుషితం అయ్యిందని, గత ప్రభుత్వం చేసిన పాపాల లెక్క సరిచేయడమే కూటమి ప్రభుత్వానికి సరిపోతుందని, బాధితులకు తక్షణ సాయం కింద తానూ వ్యక్తిగతంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయిల చొప్పున 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు పవన్.
అలాగే ఈ అతిసారం వలన ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి కూడా మరింత సాయం అందేలా చర్యలు తీసుకుంటానని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పై స్పందించడమే కాదు సాయం చేయడంలో కూడా పవన్ సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నారు.
సొంత డబ్బు మాట అటుంచితే, ప్రభుత్వం అందించే సాయంలో కూడా వాటా అడిగిన నీచ చరిత్ర గల వైసీపీ నేతలు, తన కష్టార్జితాన్ని ప్రజల కష్టాలు తీర్చడానికి వెచ్చించే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం విడ్డురంగా ఉంది అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ వేస్తున్నారు జనసైనికులు.




