పవన్-పురందేశ్వరి భేటీ ఇంకా ఆలస్యం దేనికి?

Pawan-Kalyan-Daggubati-Purandeswariఏపీ బిజెపి అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన-బిజెపిల మద్య పొత్తులు కొనసాగుతాయని, త్వరలోనే తాను పవన్‌ కళ్యాణ్‌తో భేటీ భవిష్య ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తానని చెప్పారు. అయితే పవన్‌ వారాహి యాత్రలతో చాలా బిజీగా ఉండటంతో ఇంతవరకు వారు భేటీ అవలేదు.

ADVERTISEMENT

కానీ పురందేశ్వరి ఆదేశం ప్రకారం జనసేన కార్యకర్తలతో బిజెపి కార్యకర్తలు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా బిజెపి నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంచాయితీలకు తిరిగి చెల్లించాలంటూ బిజెపి పిలుపు మేరకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో బిజెపితో పాటు జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సోమూ వీర్రాజు హయాంలో ఆయన పవన్‌ కళ్యాణ్‌కు దూరంగానే ఉన్నారు. కనుక ఏనాడూ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయలేదు. కానీ పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన నెల రోజులలోపే ఈ మార్పు తీసుకురాగలిగారు.

రెండు పార్టీలు కలిసి ఆందోళనలు చేయడం సులువే కానీ ఎన్నికలలో సీట్లు సర్దుబాటు చేసుకొని కలిసి పోటీ చేయడమే చాలా కష్టం. పైగా పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తులు పెట్టుకోవాలని కోరుకొంటున్నారు కూడా. ఇంతవరకు మూడు పార్టీల పొత్తులు విషయం తేలలేదు. ఈ విషయం తమ అధిష్టానం చూసుకొంటుందని పురందేశ్వరి చెపుతున్నారు. బహుశః ఈ విషయం ఇంకా తేలలేదు కనుకనే పురందేశ్వరి, పవన్‌ కళ్యాణ్‌ భేటీకి తొందరపడటంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ మూడు పార్టీల పొత్తులు ఉంటాయో లేదో త్వరగా తేల్చుకోకపోతే అవే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బిజెపితో పొత్తులో ఉన్నప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని ప్రకటించుకోవడం, దీనిపై బిజెపి స్పందించకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది.

బిజెపిని సంప్రదించకుండానే పవన్‌ కళ్యాణ్‌ కొన్ని నియోజకవర్గాలలో జనసేన అభ్యర్ధులను ప్రకటిస్తుండటం బిజెపికి ఇబ్బందికరంగా మారవచ్చు. ఈ గందరగోళాన్ని వైసీపీ అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు. కనుక పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి చర్చించుకొని ఓ నిర్ణయానికి వస్తే వాటికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories