రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలతో రాజకీయ చదరంగాన్ని కొనసాగిస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానం.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అధికార, విపక్షాలైన కాంగ్రెస్ – బిఆర్ఎస్ లు ఎన్నికల ప్రచారంలో, అభ్యర్థుల ఎంపికతో దూసుకుపోతున్నాయి.
జనసేన కూడా తెలంగాణ ఎన్నికల బరిలో పోటీకి సై అనడంతో ఈ సారి ఎన్నికలలో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు తెలపాలని కిషన్ రెడ్డితో ఆటమొదలుపెట్టింది బీజేపీ అధిష్టానం. కిషన్ రెడ్డితో చర్చలు జరిపిన పవన్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.కానీ జనసేన నేతలు మాత్రం ఈసారి తెలంగాణ ఎన్నికలో ‘తగ్గేదెలా’ అని తమ అధినేత పవన్ కు తేగేసిచెప్పేశారు.
ఇటు ఏపీలో కూడా బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన చంద్రబాబు అరెస్టుతో టీడీపీకి తన మద్దతు ప్రకటించి జనసేన – టీడీపీ కలిసి 2024 ఎన్నికల బరిలో ముందుకెళ్తారు అంటూ తన నిర్ణయాన్ని తెలియచేసారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల ఆశీస్సులతో ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని తానూ ఆశిస్తున్నట్లు ఇప్పటికే పవన్ పలుమార్లు తన అభిప్రాయాన్ని తెలిపారు.
చంద్రబాబు అరెస్టుతో టీడీపీ పార్టీ ఎదుర్కుంటున్న సమస్యలకు కూడా పరిష్కారం బీజేపీ చేతిలో ఉన్నందున పవన్ తీసుకునే నిర్ణయం పైనే ఇటు ఏపీ రాజకీయాలు అటు తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయి. తెలంగాణాలో కూడా పొత్తులో భాగంగా జేఎస్పీ – బీజేపీ పార్టీలు ఎన్నికల బరిలో దిగితే పవన్ అటు జనసేన నేతలను ఇటు బీజేపీ అధిష్టానాన్ని తృప్తి పరిచినవారవుతారు.
అలాకాక తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన వెనకడుగు వేసి బీజేపీకి మద్దతు తెలిపితే జనసైనికుల నుండి పవన్ గట్టి వ్యతిరేకతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ పార్టీ నేతల కోసం త్యాగాలు చేసిన జనసేన నేతలు అందుకు మేము సిద్ధంగా లేమని పవన్ కు తమ నిర్ణయాన్ని తెలియచేయడంతో ఈ కిష్ట పరిస్థితుల నుండి ఏ నిర్ణయంతో అటు పార్టీ నాయకులను, ఇటు బీజేపీ అధిష్టానాన్ని మెప్పించేలా పవన్ బయట పడతారో వేచి చూడాలి.
ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందో అటు అన్ని రాజకీయ పార్టీలకు, తెలుగు ప్రజలకు నిరూపించుకునే అవకాశం పవన్ కు దక్కింది. “తానొగ్గక ఇతరులను నొప్పించక” పవన్ తన రాజకీయ చాణక్యంతో ముందడుగు వేయాల్సిన సమయం ఇది. తెలంగాణలో జనసేన నేతల నిర్ణయాలతో, ఏపీలో బాబు అరెస్టుతో ఏ నిర్ణయానికి కట్టుబడాలో సందిగ్ధంలో పడిన పవన్ కు హస్తిన నుండి పిలుపురావడం తో పొత్తా? పరిష్కారమా? అంటూ రెండు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.




