సంక్రాంతి నుంచి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుందని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిన్న ట్విట్టర్ పేర్కొన్నారు. జనవరి 1 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు నాయకులకు అమరావతిలో అందుబాటులో ఉంటానన్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్ నుండి రాకపోకలు సాగిస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు అమరావతికి మకాం మార్చనున్నట్టు సమాచారం. దీనికోసం ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.
[m9ad]
కుటుంబానికి కొంత దూరంగా ఉండాల్సి రావడంతో ఈ లోగా ఆయన వారితో కలిసి యూరప్ యాత్రకు వెళ్లారు. తన శ్రీమతి అన్నా లెజెనోవా కోరికపై వారి పుత్రుడు శంకర్ పవనోవిచ్ కు క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి చెయ్యవలసిన కొన్ని లాంఛనాలు ఆయన అక్కడ పూర్తి చేసి వస్తారని సమాచారం. క్రిస్మస్ పండుగా అక్కడ జరుపుకుని ఆ తరువాత ఆయన హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు. యూరప్ పర్యటన తరువాత ఆయన అమరావతిలో అందుబాటులో ఉండబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవలే అమెరికా పర్యటన ముంగించుకుని తిరిగి వచ్చారు. ఇటీవలే పెతాయి తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడిన తూర్పు గోదావరి జిల్లా సందర్శనకు ఆయన వెళ్తారని వార్తలు వచ్చినా అది ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. యూరప్ పర్యటన తరువాత వచ్చే నెలలో ఆయన తన రాయలసీమ జనసేన పోరాట యాత్రను తిరిగి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తరువాత వివిధ పార్టీల నుండి కొన్ని చేరికలు కూడా ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



