పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తెలిసీతెలియక ఏపీ రాజకీయ బురదలో అడుగుపెట్టి ఇప్పుడు తీరికగా అందుకు చింతిస్తున్నారు. బ్రో సినిమాపై మంత్రి అంబటి రాంబాబు ఎంతగా చిందులు వేసినప్పటికీ పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదు. కానీ ఈ సినిమాలకు, రాజకీయాలకు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ స్పందించారు.
‘దయచేసిన నన్నూ నా పిల్లలని ఈ రాజకీయ బురదలోకి లాగొద్దు ప్లీజ్ అంటూనే, పవన్ కళ్యాణ్ ఉన్నత వ్యక్తిత్వం కలవారని, ప్రజల కోసమే కుటుంబాన్ని, సినిమాలను వదులుకొని రాజకీయాలలోకి వచ్చారని కనుక అందరూ ఆయనను ఆదరించి, ఎన్నికలలో గెలిపించాలంటూ’ రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశం పెట్టారు.
దానికి మంత్రి అంబటి రాంబాబు కూడా క్లుప్తంగా బదులిచ్చి ఊరుకొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
వాటిపై ఆమె స్పందిస్తూ, తాను, పవన్ కళ్యాణ్ విడిపోయినప్పుడు ఇలాగే చాలామంది తనను నిందించారని, మళ్ళీ ఇప్పుడూ అలాగే నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె ఏమన్నారంటే, “ఆనాడు మేము ఎందుకు విడిపోయామో చెప్పినప్పుడు ఇలాగే అందరూ నాపై విరుచుకుపడ్డారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిష్ట దెబ్బతీసేందుకే నేను ఎవరిదగ్గరో డబ్బు తీసుకొని ఆవిదంగా మాట్లాడనని ఆరోపిస్తూ నన్ను చాలా మంది దూషించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచివారని, ఆయనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరినప్పుడు కూడా నాకు ఎవరో డబ్బు ముట్టజెప్పి నాచేత అలా మాట్లాడించారంటూ నన్ను తిడుతున్నారు. అయితే నేనెప్పుడు నిజాలే మాట్లాడాను.
నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయనను ద్వేషించేవారికి నేను ఎప్పుడూ బలైపోతూనే ఉన్నాను. నన్ను దూషించడం వలన మీకు మనశాంతి లభిస్తుందనుకొంటే ఇంకా దూషించుకోండి. మీ అందరి తిట్లు భరిస్తూ జీవితం గడపాలని నాకు రాసుందేమో? కానీయండి…” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టారు.
సోషల్ మీడియా ద్వారా ఏ రంగంలో సెలబ్రేటీలైనా ఎంత పాపులర్ అవుతారో, తేడా వస్తే అంతే ద్వేషాగ్నికి బలవుతుంటారు. రేణూ దేశాయ్‌కి ఈ విషయం తెలియదనుకోలేము. అలాగే ఏపీలో బురద రాజకీయాల గురించి కూడా అవగాహన ఉండే ఉంటుంది.
అయినప్పటికీ ఆమె పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా సందేశం పెట్టడంతో ఆయన ప్రత్యర్ధులకు అవకాశం కల్పించిన్నట్లయింది. ఓ భారతీయపౌరురాలిగా ఆమెకు తన రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితులను కూడా గమనించి మెలగడం చాలా అవసరం.
ఈ రాజకీయ బురదలోకి నన్నూ నా పిల్లలని లాగొద్దని అభ్యర్ధిస్తూ మళ్ళీ ఆమే రాజకీయాలు మాట్లాడి ఈ బురదలో స్వయంగా కాలుపెట్టారు. పవన్ కళ్యాణ్‌కి ఒంటరి పోరాటం చేయగల సత్తా ఉంది కనుక రేణూ దేశాయ్ ఈ నీచ రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.



