Pawan Kalyan Involvement In Tamil Nadu Politics

పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్‌ తమిళనాడులో హిందీ భాషా వివాదంపై చేసిన వ్యాఖ్యలకు అప్పుడే తమిళనాడులో అధికార డీఎంకే నేతల నుంచి ఘాటుగా రియాక్షన్ వస్తోంది. ఇప్పుడు చర్చ దాని గురించి కాదు.

తెలంగాణలో జనసేన ఉంది. ఎన్నికలలో పోటీ చేసింది కూడా. కానీ పవన్ కళ్యాణ్‌ తెలంగాణ రాజకీయాలు, అక్కడి జనసేన పార్టీ విస్తరణ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

తమిళనాడులో జనసేన లేదు. కనుక అక్కడ పోటీ చేసే ప్రసక్తే ఉండదు. కానీ పవన్ కళ్యాణ్‌ తరచూ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.

ఎప్పటికైనా తమిళనాడులో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతోంది. తమిళనాడులో జయలలిత ఆకస్మిక మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే బలహీనపడింది. శశికళ దానిని టేకోవర్ చేయబోయే కేంద్రం చక్రం తిప్పి ఆమెను జైలుకి పంపింది. ఆ తర్వాత రాజకీయాలకు అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉంచి, ఆ పార్టీని తన రిమోట్ పద్దతిలో నడిపిస్తోంది.

Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?

అన్నాడీఎంకే బలహీనపడటంతో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే అధికారంలోకి రాగలిగింది తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసిన బీజేపి రాలేకపోయింది. కనుక తమిళనాడులో మంచి పరిచయాలు, ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్‌ని బీజేపి ఎంచుకుని, ఆ రాష్ట్రంలో బీజేపికి బలమైన పునాది వేసే బాధ్యత పవన్ కళ్యాణ్‌కి అప్పగించిందని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్‌ అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా, డీఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ బీజేపికి లీడ్ ఇస్తున్నట్లు భావించవచ్చు.

అయితే టీడీపీ కూడా బీజేపితో పొత్తులో ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు తమిళనాడు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఆ రాష్ట్రంలో హిందీ విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏపీలో హిందీతో సహా 10 భారతీయ భాషలను, విదేశీ భాషలను కూడా ప్రోత్సాహిస్తామని చెప్పారే తప్ప త్రిభాషా వివాదంలో వేలు పెట్టలేదు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

అలాగే జనాభా లెక్కన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో డీఎంకే వాదనలను సిఎం చంద్రబాబు నాయుడు సమర్ధించలేదు. ఖండించలేదు. దేశ భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా దేశ జనాభా గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పారు.

సిఎం చంద్రబాబు నాయుడు తమిళనాడుతో ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే, డెప్యూటీ సిఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ అందుకు భిన్నంగా తమిళనాడు రాజకీయాలలో వేలుపెడుతుండటం సమంజసమేనా?




ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో జనసేనని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సిన పవన్ కళ్యాణ్‌, తమిళనాడు రాజకీయాలలో వేలు పెట్టడం అవసరమా?ఇప్పటికే సినిమాలు, రాజకీయాలు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. మూడో పడవ అవసరమా?దాంతో కొత్త సమస్యలే తప్ప రాజకీయంగా ఏం ప్రయోజనం ఉంటుంది? ఆలోచిస్తే మంచిదేమో?