జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రకు సిద్దం అవుతున్నారు. నిన్న మంగళగిరి, పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చించి షెడ్యూల్ ఖరారు చేశారు.
ఈ నెల 9న ఏలూరులో భారీ బహిరంగసభ నిర్వహించి రెండో విడత వారాహి యాత్ర ప్రారంభించబోతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈసారి ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో, స్థానిక కుల సంఘాల పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశమై రాష్ట్ర రాజకీయాల గురించి చర్చిస్తారు.
పవన్ కళ్యాణ్ గత నెల 14న అన్నవరం నుంచి మొదటి విడత వారాహి యాత్ర ప్రారంభించి నెలాఖరు వరకు కొనసాగించారు. ఆ యాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా జనసేన పార్టీకి కొన్నివర్గాల మద్దతు కూడగట్టగిలిగారు కూడా. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
తొలి విడత యాత్రలో పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చెప్పారంటే ఇతర పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఎలా చేసుకొన్నప్పటికీ తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని విస్పష్టంగా చెప్పారు. అయితే ఇది బిజెపికి ఆమోదమేనా? అనే విషయం ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్న దగ్గుబాటి పురందేశ్వరి కూడా చెప్పాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడే ఆమె ఈవిషయం ప్రకటించిన్నట్లయితే, వారాహి యాత్ర మరింత విజయవంతం అవుతుంది. అప్పుడు రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ప్రజలలోకి వెళ్ళగలిగితే మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాట్ల గురించి తాపీగా ఆలోచనలు చేయవచ్చు.
బిజెపి-జనసేనల మద్య స్పష్టత వస్తే ఆ తర్వాత వాటితో టిడిపి కూడా కలుస్తుందా లేదా అనేది జూలై 18న ఢిల్లీ అశోకా హోటల్‌లో జరుగబోయే బిజెపి మిత్రపక్షాలు (ఎన్డీయే) సమావేశంలో స్పష్టత వస్తుంది.
అయితే పొత్తుల విషయయంలో మూడు పార్టీలు ఎంత త్వరగా స్పష్టత ఇస్తే అంతా వాటికే మంచిది. ఎందుకంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెపుతుండగా, పవన్ కళ్యాణ్ నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెపుతుండటంతో ప్రజలలో అయోమయం ఏర్పడుతోంది. ఒకవేళ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొనే మాటైతే ఆ విషయం త్వరగా ప్రకటించి, తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ప్రజలకు చెప్పడం చాలా అవసరం.



